వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణాల పేరుతో సాగించిన అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి కి చెందిన రాక్రీట్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. పులివెందులలో జగనన్న కాలనీల లబ్ధిదారులను మోసం చేశారనే ఆరోపణలతో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ సరఫరా , నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఈ సంస్థ, ప్రభుత్వ నిధులను డ్రా చేసి కూడా పనులు పూర్తి చేయలేదని, నాసిరకం మెటీరియల్ వాడిందని లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వ పెద్దల అండదండలతో తోపుదుర్తి కుటుంబం రాక్రీట్ సంస్థ ద్వారా అనంతపురం , కడప జిల్లాల్లోని సుమారు 45 వేలకు పైగా ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒక్కో ఇంటికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో పడాల్సిన సుమారు రూ. 1.80 లక్షల చొప్పున కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను ఈ సంస్థ తన ఖాతాలకు మళ్లించుకున్నట్లు విచారణలో తేలింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని జి.హెచ్. కాలనీలో 924 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సుమారు రూ. 25.80 కోట్లు కాజేసినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
పులివెందులలో పర్యటించిన హౌసింగ్ అధికారులు , పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా, అనేక ఇళ్లు కేవలం పునాదుల స్థాయిలోనే ఉన్నా పూర్తిస్థాయి నిధులు డ్రా అయినట్లు గుర్తించారు. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే వారి వేలిముద్రలు, సంతకాలను అడ్డం పెట్టుకుని ఈ దోపిడీ సాగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాక్రీట్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు, తోపుదుర్తి సోదరుల పాత్రపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. నిధుల మళ్లింపులో సహకరించిన అప్పటి అధికారులను కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉంది. త్వరలో తోపుదుర్తి సోదరులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
