వైసీపీ నేతలు ఆజ్ఞాతంలో ఉండటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారేమో కానీ ఇలా కేసు నమోదు కాగానే అలా మాయం అవుతున్నారు. కోర్టుల్లో రిలీఫ్ దొరికే వరకూ బయటకు రావడం లేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గాయబ్ అయి చాలా కాలం అయింది. అంతకు ముందు ఆయన తాను ఎక్కడికి పోనని దమ్ముంటే అరెస్టులు చేసుకోవచ్చని సవాల్ చేశారు.కానీ కేసు నమోదు కాగానే కనిపించకుండా పోయారు. కానీ ఆయనకు కోర్టుల్లో ఊరట దక్కలేదు. పోలీసులు ఆయన కోసం వెదుకుతున్నారు. కాకాణి చూసి చాలా రోజులు అయిందని ఓ సారి చూడాలని ఉందని.. సోమిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పుడు ఆయన తరహాలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాయమయ్యారు. ఇటీవల జగన్ రాప్తాడులో పర్యటించారు. ఈ సందర్భంగా జన సమీకరణ చేసి హెలికాఫ్టర్ చుట్టూ మనుషుల్ని గుమికూడేలా చేసి.. ఏదో జరిగిపోతుందన్న కుట్ర పన్నేందుకు ప్లాన్ చేశారు. పోలీసులపై దాడులకు ప్రేరేపించారు. దీనిపై కేసు నమోదు అయింది. కేసు నమోదు అయినప్పుడు ఆయన కూడా దమ్ముంటే అరెస్టు చేసుకోవాలని అన్నారు. తీరా అరెస్టు చేస్తారన్న సమాచారం ఆధారంగా జంప్ అయిపోయారు. అరెస్టు చేయకుండా రిలీఫ్ కోసం కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు.
వైసీపీ నేతల వ్యవహారం మాటలు కోటలు దాటుతాయి..కానీ ధైర్యం మాత్రం గుండెల్లోనుంచి బయటకు రాదన్నట్లుగా ఉంది. అరెస్టులకు భయపడబోమని హెచ్చరిస్తూ ఉంటారు. తీరా కేసులు నమోదయి.. జైలుకు వెళ్లక తప్పదన్న స్థితిలో కనిపించకుండా పోతున్నారు.