ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో సెంట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం, అందులో రాక్రీట్ సంస్థ పాత్ర ఇప్పుడు ముదురుతోంది. పేదలకు ఇళ్లు కట్టిస్తామనే పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని ఈ సంస్థ ఎలా దారి మళ్లించిందో సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తున్నా, చర్యల విషయంలో జరుగుతున్న ఆలస్యం చర్చనీయాంశమవుతోంది.
పులివెందుల నుంచి విజయవాడ వరకు దోపిడీ
సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో రాక్రీట్ సంస్థ ప్రధాన కాంట్రాక్టరుగా చలామణి అయ్యింది. కేవలం పులివెందుల, కడపలోనే కాకుండా గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లో కూడా ఈ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా పనులు కట్టబెట్టారు. ప్రీ-ఫ్యాబ్ టెక్నాలజీ పేరుతో గోడలు నిర్మిస్తామని చెప్పి, ప్రభుత్వం నుంచి అడ్వాన్సుల రూపంలో వందల కోట్లు డ్రా చేసి.. క్షేత్రస్థాయిలో కనీసం పునాదులు కూడా తీయని పరిస్థితి నెలకొంది. తాజాగా విజయవాడలో ఈ సంస్థపై కేసు నమోదు కావడం, అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది.
విచారణలో వెలుగు చూసిన నగ్న సత్యాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాక్రీట్ సంస్థ కేవలం కాగితాల మీద పనులు చూపించి, ఇన్వాయిస్లు సృష్టించి ఖజానాను కొల్లగొట్టిందని నిర్ధారణ అయ్యింది. పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు రూ.150 కోట్ల పైచిలుకు నిధులు పక్కదారి పట్టాయని లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ జగన్ రెడ్డి కోటరీకి అత్యంత సన్నిహితులైన వారే నిర్వహించారని, అందుకే అప్పట్లో ఏ అధికారి కూడా నోరు మెదపలేదని ఇప్పుడు స్పష్టమవుతోంది.
చర్యలు ఎప్పుడు? వసూళ్లు ఎప్పుడు?
అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి, కేసులు నమోదయ్యాయి.. కానీ ప్రజలు కోరుకుంటున్నది కేవలం కేసులు కాదు, రికవరీ . సామాన్యుడి సొమ్మును లూటీ చేసిన రాక్రీట్ వంటి సంస్థల ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులను మళ్లీ ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. విజయవాడలో పెట్టిన కేసు ఒక ఆరంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ స్కామ్‌పై సీఐడీ లేదా విజిలెన్స్ విచారణను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షసాధింపు అని వైసీపీ మొత్తుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ఇళ్లు పూర్తికాకపోవడమే అతిపెద్ద సాక్ష్యం. ఇళ్ల పట్టాలు చేతిలో ఉన్నా, ఇళ్లు లేని పేదలు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.
అవినీతి తిమింగలాలకు చెక్ పెట్టాలి
రాక్రీట్ ఉదంతం కేవలం ఒక సంస్థ అక్రమం మాత్రమే కాదు, అది గత ప్రభుత్వ వ్యవస్థాగత అవినీతికి నిదర్శనం. ప్రజలు మార్పు కోరుకుని కూటమికి పట్టం కట్టింది ఇలాంటి గూండాయిజం, లూటీలను అంతం చేయడానికే. విజయవాడ కేసు తదుపరి పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించనున్నాయి. దోషులెంతటి వారైనా సరే, ప్రజాధనాన్ని కక్కిస్తేనే న్యాయం జరిగినట్లు అవుతుంది.
