తెలంగాణలో జరిగిన గొర్రెల స్కాం చిన్నది కాదని.. గొర్రె పిల్లలను అడ్డం పెట్టుకుని వెయ్యి కోట్లు దోచుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తాజాగా తేల్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఇంట్లో సోదాలు జరిపి పెద్ద ఎత్తున నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అంశంపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ స్కాం ఓ బెట్టింగ్ రాకెట్‌తో కలిసి ఉందని.. వాటికి సంబంధించిన డమ్మీ బ్యాంక్ అకౌంట్లు, ఫోన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది.
ఈడీ ప్రకటన సహజంగానే తెలంగాణ రాజకీయవర్గాల్లో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. గొర్రెల స్కాం అంటే చిన్నది అనుకున్నారు. కేసీఆర్ బీసీలకు మేలు చేసేందుకు ముఖ్యంగా గొల్ల కురుమల కోసం ఈ పథకం తెచ్చారు. గొర్రెల యూనిట్లు ఇస్తామని చెప్పి .. ఆ యూనిట్లను రీ సైకిల్ చేయడం.. పేపర్ల మీదే పంపిణీ చేసి డబ్బులు నొక్కేశారు. ఏసీబీ విచారణలోనే ఇవన్నీ బయటపడ్డాయి. కల్యాణ్ కుమార్ ను ఓ సారి అరెస్టు చేశారు.
అయితే ఇంత పెద్ద స్కాం.. సదరు మంత్రికి తెలియకుండా.. అది కూడా.. రాజకీయంగా లాభం కలిగించేలా… పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీకి చెందిన స్కీమ్ వ్యవహారంలో ఇంత పెద్ద అక్రమాలు జరుగుతూంటే.. సదరు మంత్రికి తెలియకుండా ఉంటుందా అన్నది అందరికీ వచ్చే సందేహం. అందుకే ఈడీ ఈ ప్రకటనతో సరి పెట్టదని.. ముందు ముందు కొన్ని కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.