కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఆయన పీఏ కడూరు చిన్నప్పన్న చుట్టూ ఈ కుంభకోణం తిరుగుతోంది. కెమికల్ నెయ్యి సరఫరా వెనుక ఉన్న అసలు క్రోనాలజీని సీబీఐ ఛార్జ్‌షీట్ బట్టబయలు చేస్తోంది.
పీఏ నుంచి స్పెషల్ ఆఫీసర్ వరకు చిన్నప్పన్న ప్రస్థానం
కడూరు చిన్నప్పన్న అనే వ్యక్తి 2015-18 మధ్య వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా ఉండేవారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. వెంటనే చిన్నప్పన్నను తన పీఏగా నియమించుకున్నారు. అయితే, కొద్ది నెలలకే అక్టోబర్ 2019 అతడిని ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ గా జగన్ నియమించారు. ఈ నియామకం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. టెండర్ నిబంధనల సడలింపు నుంచి డీల్స్ కుదుర్చుకోవడం వరకు చిన్నప్పన్నే కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
లంచంగా సామ్సంగ్ ఫోన్లు.. భోలే బాబా’ ఎంట్రీ
2021లో భోలే బాబా అనే సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ దాఖలు చేసింది. టెక్నికల్ ఇన్స్పెక్షన్ పేరుతో నాటకమాడిన టీటీడీ అధికారులు, ఆ సంస్థ నుంచి సామ్సంగ్ మొబైల్ ఫోన్లను లంచంగా తీసుకుని ప్లాంట్ ఇన్స్పెక్షన్లో క్వాలిఫై చేశారు. ఇందులో టీటీడీ జీఎం ప్రొక్యూర్మెంట్ ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించారు. చిన్నప్పన్న ఫోన్ నంబర్‌ను తన మొబైల్ లో PA to Chairman అని సేవ్ చేసుకున్న సుబ్రహ్మణ్యం, పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పనిచేశారు.
కేజీకి రూ. 25 కమీషన్ – బెడిసికొట్టిన డీల్
మే 10, 2022న భోలే బాబా సంస్థ టెక్నికల్ ఎవల్యూషన్లో అర్హత సాధించింది. అయితే, మే 15న అసలు డ్రామా మొదలైంది. చిన్నప్పన్న ఆ సంస్థ ప్రతినిధి పోమిల్ జైన్ కి ఫోన్ చేసి, సరఫరా చేసే ప్రతి కేజీ కల్తీ నెయ్యిపై రూ. 25 చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి పోమిల్ జైన్ నిరాకరించడంతో, కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. జూన్ 6న ప్లాంట్‌ను తనిఖీ చేసిన సుబ్రహ్మణ్యం, చిన్నప్పన్న ఆదేశాల మేరకు ఆ కంపెనీకి అర్హత లేదని నివేదిక ఇచ్చారు.
-అప్రూవల్ వెనుక అంతర్యమేమిటి?
డిస్క్వాలిఫై అయిన నెల రోజులకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూలై 25, 2022న అదే భోలే బాబా సంస్థకు 9450 కేజీల నెయ్యి సరఫరా చేసే ఆర్డర్ లభించింది. అంటే, ఈ నెల రోజుల గ్యాప్‌లో తెర వెనుక భారీ డీల్ కుదిరిందని స్పష్టమవుతోంది. ఆగస్టు 3న వచ్చిన CFTRI ల్యాబ్ రిపోర్ట్ ఆ నెయ్యి కల్తీ అని తేల్చిచెప్పినా.. వైవీ సుబ్బారెడ్డి, చిన్నప్పన్న, సుబ్రహ్మణ్యం కలిసి ఆ నివేదికను తొక్కిపెట్టారు. ల్యాబ్ రిపోర్ట్ వ్యతిరేకంగా ఉన్నా, ఆ కంపెనీకి అదనంగా మరో 1.07 లక్షల కేజీల ఆర్డర్ ఇచ్చారు. అక్టోబర్ 2022 వరకు తిరుమల లడ్డూ తయారీలో ఈ కల్తీ నెయ్యినే వాడినట్లు విచారణలో తేలింది.
భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ, కేవలం కమీషన్ల కోసం వైవీ సుబ్బారెడ్డి పీఏ నెరిపిన ఈ నెట్వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంత బుకాయించినా బయటపడటం అసాధ్యంగా కనిపిస్తోంది.


