వైసీపీ వ్యూహకర్తలు ఎవరో కానీ అన్నీ రివర్స్‌లో తమ మెడకు చుట్టుకునే పనులే చేస్తూంటారు. కల్తీనెయ్యిపై ఏకసభ్య కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. వెంటనే ఈ కమిటీ చెల్లదని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించారు. ప్రభుత్వం అన్ని రకాల లీగల్ ఒపీనియన్స్ తీసుకుని సిట్ .. చర్యలు తీసుకోవాలని ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఏకసభ్య కమిటీని నియమించింది. దాన్ని సుప్రీంకోర్టు ఎలా వ్యతిరేకిస్తుందని వైసీపీ న్యాయనిపుణులు అనుకున్నారో కానీ ఇప్పుడు.. ఆ కమిటీని సుప్రీంకోర్టు సమర్థిస్తే నిండా ఇరుక్కుపోతారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సమగ్ర విచారణ జరిపిన సిట్ , ఇటీవల తన అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ నివేదిక ఆధారంగా, టెండర్ల నిబంధనల సడలింపు , పరిపాలనాపరమైన లోపాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు సిఫార్సు చేయడానికి ప్రభుత్వం మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. అయితే, ఈ కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు గతంలోనే ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించినందున, దర్యాప్తు ముగిసిన తర్వాత ప్రభుత్వం తీసుకునే క్రమశిక్షణా చర్యలను కోర్టు తప్పుపడుతుందని భావించడం వారి అతివిశ్వాసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ ఏకసభ్య కమిటీని సమర్థిస్తే, వైకాపాకు అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. అధికారుల పాత్రతో పాటు, నాటి బోర్డు నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లను ఈ కమిటీ బయటపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ నివేదికలో 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయినట్లు, దీనివల్ల రూ. 250 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆధారాలు లభించడంతో, ఈ కమిటీ ఇచ్చే నివేదిక నేతల చుట్టూ ఉచ్చు బిగించే ప్రమాదం ఉంది.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దర్యాప్తు సంస్థ తన పని పూర్తి చేసిన తర్వాత, పరిపాలనాపరమైన లోపాలపై ప్రభుత్వం కమిటీని వేయడం సర్వసాధారణం. దీన్ని అడ్డుకోవాలని చూడటం ద్వారా వైసీపీ అనవసరంగా కోర్టులో ఇరుక్కుపోయే పరిస్థితి తెచ్చుకుందని భావిస్తున్నారు.