ఆలయాల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, ఇటీవల కాలంలో రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కుట్రపూరిత ఉద్దేశాలతో దేవాలయాలను వివాదాల్లోకి నెట్టడం, పవిత్రతకు భంగం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై సామాన్య శిక్షలు సరిపోవు. వారు జీవితాంతం మర్చిపోలేని విధంగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం కనిపిస్తోంది. దేవుడంటే నమ్మకం లేని వారు దేవుడినే దోచుకున్నారు. ఇప్పుడు అపవిత్రతకు కుట్రలు చేస్తున్నారు.
తిరుమలలో మద్యం సీసాల కుట్ర – చిన్నది కాదు !
తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు జరిగిన ఒక కుట్రను పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. తిరుమల కొండపై మద్యం సీసాలు దొరికాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఘటనలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తతో పాటు ఒక ఫోటోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలను కొండపైకి తీసుకువెళ్లి, పొదల్లో వేసి ఫోటోలు తీసి దుష్ప్రచారం చేశారని విచారణలో తేలింది. ఇలాంటి నీచమైన చర్యలు కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా, కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇది చిల్లర నేరం కాదు. వీరు హిందూ సమాజంపైనే దాడి చేశారు. రాజకీయ కుట్రల కోసం దేవుడిపై దాడి చేసినట్లే ప్రవర్తించారు.
వరుస ఘటనలు – కఠిన చర్యల అవసరం
కేవలం తిరుమలనే కాకుండా, ఇటీవల ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం వంటి ఘటనలు కూడా భక్తులను కలిచివేస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు సిసిటివి దృశ్యాల ఆధారంగా పట్టుకున్నారు. వ్యక్తిగత కోపతాపాలు లేదా రాజకీయ ప్రేరేపిత కుట్రలతో ఆలయాలపై దాడులకు తెగబడటం క్షమించరాని నేరం. గతంలో జరిగిన అంతర్వేది రథం దగ్ధం నుంచి నేటి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల వరకు ప్రతి విషయంలోనూ నిష్పక్షపాత విచారణ జరిపి, దోషులను సమాజం ముందు నిలబెట్టాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఎన్నో!
అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కల్తీనెయ్యి వాడి ఐదు సంవత్సరాల పాటు శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. శాలువాలు దగ్గర నుంచి టిక్కెట్ల వరకూ దేన్నీ వదిలి పెట్టలేదు. దోచుకున్నారు. అధికారం పోయాక కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిని వదిలిపెడితే దేవుడికి కూడా కోపం వస్తుంది.
రాజకీయ క్రీడకు ఆలయాలు వేదిక కాకూడదు
దేవుడిని, ధర్మాన్ని రాజకీయాల్లోకి లాగడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుంది. రాజకీయ పార్టీలు తమ పంతాల కోసం పవిత్ర క్షేత్రాలను వాడుకోవడం మానుకోవాలి. ఆలయాల వద్ద భద్రతను పెంచడంతో పాటు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే ‘కీచకుల’పై సైబర్ క్రైమ్ చట్టాల ద్వారా కఠినంగా వ్యవహరించాలి. దేవాలయాల పవిత్రతను కాపాడటంలో రాజీ పడకూడదని, అపచారానికి పాల్పడే వారికి చట్టం ద్వారా గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు.
