రాజకీయాల్లో అనవసరంగా మాట్లాడకూడదు. విధేయత చూపించాలనుకున్నా ఒక్కో సారి మౌనంగా ఉండాలి. మా బాస్ ను అంత మాట అంటారా అని సమర్థించడానికి వెళ్తే మరింత పరువు తీసినట్లుగా అవుతుంది. ప్రస్తుతం తిరుపతి ఎంపీ గురుమూర్తి అదే చేస్తున్నారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మోదీ కాళ్లపై పడిన దాన్ని మరింత చర్చకు తెస్తున్నారు.
ఇటీవల జగన్ రెడ్డి చంద్రబాబు, రేవంత్, రాహుల్ మధ్య హాట్ లైన్ ఉందని ఆరోపించారు. ఏపీలో ఓట్ల చోరీపై మాట్లాడటం లేదన్నారు. దీనిపై మాణిక్కం ఠాగూర్ మండిపడుతున్నారు. జగన్ మోదీ, అమిత్ షాకు ఎలా లొంగిపోయారో వివరిస్తున్నారు. తాజాగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు మోడీ కాళ్లు పట్టుకున్న ఫోటోను పోస్టు. చేసి.. ఇలా చేసిన ఒకే ఒక్క సీఎం ఎవరని ప్రశ్నించారు.
ఇది తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి కోపం తెప్పించింది. మా బాస్ ను అలా అంటారా అని.. దానికి కౌంటర్ ఇవ్వాల్సిందేనని బయలుదేరారు. ఆయన తెలివితేటలన్నింటినీ ఉపయోగించి.. మోదీగారు పెద్ద మనిషి కాబట్టి.. పెద్దలను విపరీతంగా గౌరవించే జగన్ ఆయన కాళ్లకు నమస్కారం చేశారన్నారు. గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్‌కు కూడా అలాగే చేశారని వాదించారు. వెంటనే మాణిక్కం ఠాగూర్.. జగన్ తన తల్లి కాళ్లకు నమస్కరించిన ఫోటో ఉంటే చూపించాలని సవాల్ చేశారు. కానీ గురుమూర్తి దగ్గర అలాంటిదేమీ లేదు.
కానీ ఈ అంశంపై ఆయన ప్రారంభించిన చర్చ మాత్రం ఆగేలా లేదు. జగన్ రెడ్డి పెద్దల్ని గౌరవించడం ఏమిటని అందరూ నవ్వుతున్నారు. కృష్ణారామా అనుకోవాలని.. మోదీ అంత వయసు ఉన్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది కళ్ల ముందే ఉంది. తన తండ్రి వయసులో ఉండే చంద్రబాబును అన్ని మాటలన్నా జగన్.. పెద్దల్ని గౌరవించి కాళ్లకు నమస్కారం చేస్తాడని ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. మోదీ కాళ్లను వదిలేస్తే.. ఎక్కడ జైలుకెళ్తాడోనన్న భయంతోనే కాళ్లు పట్టుకున్నారని సెటైర్లు పడుతున్నాయి.