ఆరు నెలలు గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో టాలీవుడ్‌కి సంక్రాంతి, సమ్మర్ లాంటి రెండు కీలకమైన సీజన్స్ వుంటాయి. ఈ ఏడాది ఆ రెండు సీజన్స్‌ను సరిగ్గా వాడుకోలేపోయింది పరిశ్రమ. భారీ అంచనాలు వున్న సినిమాలు రాణించలేదు. అలాగని అనూహ్యమైన విజయాలు కూడా లేవు. వీటితో పాటు కొన్ని వివాదాలు, సమస్యలని కూడా చూసింది పరిశ్రమ. ఈ ఆరు నెలల ప్రయాణం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే…
జనవరి సంక్రాంతి సినిమాల సందడితో మొదలైంది. ఆరంభంలోనే పెద్ద షాక్ తలిగింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ దారుణంగా విఫలమైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా, దిల్ రాజు నిర్మాత, శంకర్ దర్శకుడు… ఇలా ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బాలకృష్ణ డాకు మహారాజ్ డీసెంట్ విజయాన్ని అందుకుంది. అయితే సంక్రాంతికి సరైన సినిమా లేదనే లోటుని వెంకటేష్ తీర్చాడు. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దిల్ రాజుకు గేమ్ చేంజర్ నష్టాలని భర్తీ చేసిన క్రెడిట్ కూడా సంక్రాంతికి వస్తున్నాం దక్కించుకొంది.
ఫిబ్రవరి చిన్నా పెద్ద కలుపుకొని దాదాపు అరడజను సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో ఒక్కటే హిట్టు. నాగచైతన్య తండేల్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని చూసింది. విశ్వక్ సేన్ లైలాతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు. అంత దారుణంగా తయారైన సినిమా ఇది. సందీప్ కిషన్ మజాకాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ధమాకా డైరెక్టర్ త్రినాథ్ రావు మరో సక్సెస్ ఇస్తాడని అనుకున్నారు. కానీ సినిమా పల్టీ కొట్టేసింది.
మార్చిని చిన్న సినిమాలు కాపాడాయి. నాని నిర్మించిన కోర్ట్ సినిమాకు మంచి విమర్శలతో పాటు వసూళ్లు కూడా దక్కాయి. ఆ సినిమా బడ్జెట్‌కి బాగానే వర్క్ అవుట్ అయ్యింది. మ్యాడ్ 2 కూడా డీసెంట్ విజయాన్ని అందుకుంది. నితిన్ రాబిన్ హుడ్ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్స్‌పై కూడా దృష్టి పెట్టాడు. అటు వెంకీ కుడుముల కూడా రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్. మైత్రీ నిర్మాణం. అయితే ఇవేవీ కూడా సినిమాకి కలిసిరాలేదు. రెండో ఆట నుంచే సినిమా తేలిపోయింది. ‘క’ విజయాన్ని కొనసాగించలేకపోయాడు కిరణ్ అబ్బవరం. దిల్ రుబాతో ఫ్లాప్ ఇచ్చాడు. ధనరాజ్ డైరెక్టర్ చేసి రామం రాఘవం మంచి ప్రయత్నం అనే పేరు వచ్చినప్పటికీ క్రౌడ్ పుల్లర్ కాలేకపోయింది.
ఏప్రిల్ డిజాస్టర్ నెలనే చెప్పాలి. సిద్ధూ జొన్నలగడ్డ జాక్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మామూలు డిజాస్టర్ కాదు. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. మొన్న సునీల్ నారంగ్ మాటలు విన్న తర్వాత జాక్ కొట్టిన దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్థం అవుతుంది. కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ అఫ్ వైజయంతి చేశాడు. చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. తల్లికొడుకుల ఎమోషన్ పండుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి వస్తారని ఆశించాడు. కానీ కంటెంట్ ప్రభావం చూపలేకపోయింది. సంపత్ నంది ఓదెల 2 విడుదలకు ముందు హల్చల్ చేసింది. కానీ సినిమా చూసిన జనం నిట్టూర్చారు. రెండో రోజుకే సినిమా డిజాస్టర్ రూట్లోకి వెళ్లిపోయింది. ప్రియదర్శి సారంగపాణి జాతకం కూడా అంతే. కామెడీ డోస్ సరిపోలేదు. చిన్న సినిమాగా వచ్చిన ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూడా ఫ్లాప్. మొత్తానికి ఏప్రిల్ నెల అంతా ఒక్క విజయం లేకుండా నిస్సారంగా గడిచింది.
నాని HIT 3 తో మే మొదలైంది. చాలా వైలెంట్ సినిమా ఇది. ఆ జోనర్ ఇష్టపడే ఆడియన్స్ బాగానే చూశారు. నిర్మాతగా నాని హ్యాపీనే. శ్రీ విష్ణు సింగిల్ తో మరో హిట్ కొట్టాడు. హాయిగా ఓ కామెడీ సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల ఆసక్తిని ఈ సినిమా కొంత మేరకు తీర్చింది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ — ఈ ముగ్గురూ కూడా సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. ముగ్గురూ భైరవంతో వచ్చారు. అయితే ఇది వాళ్ళకి కం బ్యాక్ సినిమా కాలేకపోయింది. సమంత నిర్మించి, గెస్ట్‌గా కనిపించిన శుభం, నవీన్ చంద్ర లెవెన్, రాజ్ రాచకొండ 23, ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చిన షష్టిపూర్తి… ఇవేవీ కూడా ప్రభావం చూపలేకపోయాయి.
జూన్‌లో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. ధనుష్, నాగార్జున కుబేర. శేఖర్ కమ్ముల పాన్ ఇండియా స్థాయిలో సినిమాని డిజైన్ చేశాడు. ముంబైలో షూటింగ్ చేశారు. తమిళ్లో ధనుష్, తెలుగులో నాగ్, నేషనల్ క్రష్ రష్మిక, దేవిశ్రీ మ్యూజిక్, శేఖర్ కమ్ముల బ్రాండ్ వాల్యూ… ఇవన్నీ సినిమాకి కలిసొచ్చాయి. కుబేర మంచి వసూళ్లు సాధించింది. మంచు విష్ణు కన్నప్పపై బోలెడు నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆ నమ్మకం నిజమైంది. కన్నప్ప అతని కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం రన్ కొనసాగుతోంది. విష్ణు కెరీర్‌కి ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన స్థానం దొరికే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన 8 వసంతాలు ఫ్లాప్ రిజల్ట్‌ను మూటకట్టుకుంది.
ఇక డబ్బింగ్ సినిమాల్లో కూడా మెరుపులు లేవు. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్, బాలీవుడ్ సినిమా ఛావా డీసెంట్ కలెక్షన్లు చూశాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థగ్ లైఫ్ డిజాస్టర్స్ అయ్యాయి.
వివాదాలు, సమస్యలు: టాలీవుడ్ చాలా సమస్యలతో సతమతమౌతోంది. సినిమా ప్రొడక్షన్ తగ్గిపోయింది. కొత్త సినిమాలు స్టార్ట్ కావడం లేదు. గతంలో వారానికి కనీసం అరడజను సినిమాకైనా క్లాప్ పడేది. ఇప్పుడది లేదు. సినిమా స్టార్ట్ చేయడానికి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీనికి చాలా కారణాలు వున్నాయి. సినిమా బిజినెస్‌లో ఓటీటీ కీలక పాత్ర పోషిస్తోంది. రిలీజ్ డేట్‌ని నిర్ణయించేటంత పైచేయి సాధించింది. ఓటీటీ బిజినెస్ అయితేనే సినిమా రిలీజ్ చేసుకునే పరిస్థితి. ఈ ట్రెండ్ మొతం సినిమా పరిశ్రమకే ప్రమాదకరం. ఇది ఇలానే కొనసాగితే నిర్మాత ఓటీటీలకి బ్రోకర్‌గా మారిపోయే పరిస్థితి వస్తుందనే నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు పరిస్థితిని అద్దం పడుతున్నాయి.
థియేటర్స్ బంద్ వివాదం తీవ్ర కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేసుకుంటూ సాగిన ఈ వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనే ప్రెస్ నోట్‌ని రిలీజ్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో ‘ఆ నలుగురు’ ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ఎన్నికై 24 గంటలు గడవక ముందే తన పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కార్యదర్శి శ్రీధర్ హీరో రెమ్యునరేషన్స్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. ఇప్పటికీ సింగిల్ స్క్రీన్స్ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఎనిమిది వారాల తరవాత సినిమా ఓటీటీకి ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ జరగడం లేదు. ఇండస్ట్రీలో చాలా సమస్యలు వున్నాయి. ఇవన్నీ పరిష్కారం కావాలంటే అందరూ ఏకతాటిపైకి రావాలి. అదెప్పుడు జరుగుతుందో చూడాలి.