తనకి ఇష్టం అయినా డ్రైవింగ్ చేస్తూనే

Nandamuri Hari krishna passed away
Nandamuri Hari krishna passed away

నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌డం ఆయ‌న అభిమానుల్ని, తెలుగుదేశం పార్టీ నేత‌ల్ని క‌ల‌చి వేస్తోంది. ఆమ‌ధ్య త‌న‌యుడు జాన‌కీరామ్ కూడా ఇలానే రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తండ్రినీ త‌న‌యుడ్నీ రోడ్డు ప్ర‌మ‌దాలు బ‌లి తీసుకోవ‌డం దిగ్భ్రాంతిని క‌లిగించే సంగ‌తి. అయితే హ‌రికృష్ణ‌కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న డ్రైవింగ్ చాలా బాగుంటుంద‌ని, డ్రైవింగ్‌లో ఆయ‌న నేర్పు చూసే… అప్ప‌ట్లో చైత‌న్య‌ర‌థం న‌డ‌ప‌డానికి ఎన్టీఆర్‌.. హ‌రికృష్ణ‌ని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ చైత‌న్య‌ర‌థంపై ఉన్న‌న్ని రోజులు.. ఆయ‌న‌తో పాటు తిరిగి సేవ చేశారు హ‌రికృష్ణ‌. ఆ త‌ర‌వాత కూడా…. హ‌రికృష్ణ ఎప్పుడూ డ్రైవ‌ర్‌ని నియ‌మించుకోలేదు. త‌న వాహ‌నాన్ని త‌నే న‌డిపేవారు. త‌న‌యుడు జాన‌కీరామ్ మృతి త‌ర‌వాత హ‌రికృష్ణ జాలా డిస్ట్ర‌బ్ అయ్యారు. రోడ్డుపై వెళ్ల‌డం అంటే.. కంగారు ప‌డేవార్ట‌. ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌ల‌కు త‌ర‌చూ డ్రైవింగ్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు చెప్పేవార‌ట‌. అలాంటి హ‌రికృష్ణ ఇప్పుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌డమే విధి. జాన‌కీరామ్ మ‌ర‌ణం ఆ కుటుంబాన్ని బాగా క‌ల‌చివేసింది. రోడ్డు ప్ర‌మాదాల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ ప్ర‌తీ సంద‌ర్భంలోనూ చెబుతూనే ఉంటారు. త‌న ప్ర‌తీ సినిమా టైటిల్ కార్డుల్లో ఈ విష‌యంపై అభిమానుల్ని హెచ్చ‌రిస్తూనే ఉంటారు. అలాంటిది ఆ ఇంట్లో ఇప్పుడు మ‌రో విషాదం చోటు చేసుకోవ‌డం ఊహించ‌రాని ప‌రిణామం.

హ‌రికృష్ణ కారు ప్ర‌మాదం.. అస‌లేం జ‌రిగింది?

ఈరోజు ఉద‌యం సినీ న‌టుడు, నిర్మాత‌, తెలుగుదేశం సీరియ‌ర్ నేత నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.హైద‌రాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న హ‌రికృష్ణ అన్నేప‌ల్లి వ‌ద్ద డివైడ‌ర్‌ని ఢీకొట్టుకుని ప‌ల్టీలు కొట్టింది. ఆ స‌మ‌యంలో హ‌రికృష్ణ‌తో పాటు న‌లుగురు వ్య‌క్తులున్నార‌ని తెలుస్తోంది. హ‌రికృష్ణ త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంద‌ని, అదే ఆయ‌న్ని బ‌లిగొంద‌ని వైద్యులు ధృవీక‌రించారు. ప్ర‌మాదంలో కారు న‌డుపుతున్న‌ది హ‌రికృష్ణ‌నే అని తెలుస్తోంది. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స‌మాచారం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హ‌రికృష్ణ‌ని హుటాహుటిన కామినేని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. వైద్యులు శ‌త‌విధాల ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. హ‌రికృష్ణ‌తో పాటు ఉన్న మిగిలిన న‌లుగురూ ఎవ‌రు? వాళ్ల ప‌రిస్థితేంట‌న్న‌ది తెలియాల్సివుంది.

సీటు బెల్టు పెట్టుకోలేదు.. అందుకే

హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదం మృతిపై కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈరోజు ఉద‌యం న‌ల్గొండ‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. సమీపంలోని కామినేని ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేకుండా పోయింది. నిజానికి హ‌రికృష్ణ సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందార‌ని తేలింది. కారుని స్వ‌యంగా న‌డుపుతున్న హ‌రికృష్ణ ఆ స‌మ‌యంలో సీటు బెల్టు కూడా పెట్టుకోలేద‌ని స‌మాచారం. మ‌రో కారుని దాటించ‌బోయి.. అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ని ఢీకొట్టార‌ని.. ఆ స‌మ‌యంలో కారు మూడు ప‌ల్టీలు కొట్టింద‌ని, డోరు తెరుచుకోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న కంక‌ర గుట్ట‌పై హ‌రికృష్ణ ప‌డ్డార‌ని, ఆ స‌మ‌యంలో త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంద‌ని తెలుస్తోంది. దాంతో అక్క‌డిక‌క్క‌డ మృతిచెందారు.

హ‌రికృష్ణ‌.. తీర‌ని కోరిక‌

నంద‌మూరి హ‌రికృష్ణ సినిమాల‌కు దూర‌మై చాలాకాల‌మే అయ్యింది, ఆయ‌న ఆరోగ్యం కూడా అస్స‌లు స‌హ‌రించ‌డం లేదు. ఆమ‌ధ్య బాగా చిక్కిపోయారు కూడా. అయితే.. ఈమ‌ధ్యే హ‌రికృష్ఱ‌కు మ‌ళ్లీ సినిమాల‌పై మ‌క్కువ క‌లిగింది. త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ కూడా `నాన్న‌గారిని మ‌ళ్లీ న‌టుడిగా చూడాల‌ని వుంది` అని చెబుతుండేవాడు. ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌, హ‌రికృష్ణ‌లు క‌ల‌సి ఓ సినిమాలో న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. క‌ల్యాణ్ రామ్ సినిమాలో నంద‌మూరి హ‌రికృష్ణ ఓ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని చెప్పుకున్నారు కూడా. అదెందుకో ఆగిపోయింది. `నాన్న‌గారి కోసం క‌థ‌లు వింటున్నా. ఆయ‌న్ని మ‌రిన్ని మంచి పాత్ర‌ల్లో చూడాల‌నివుంది. త్వ‌ర‌లో ఓ సినిమా మొద‌లెడ‌తాం` అని ఆమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో క‌ల్యాణ్‌రామ్ చెప్పారు కూడా. కానీ… అంత‌లోనే రోడ్డు ప్ర‌మాదం ఆయ‌న్ని మింగేసింది.

ఆ కుటుంబాన్ని వెంటాడిన రోడ్డు ప్ర‌మాదాలు

నంద‌మూరి హ‌రికృష్ణ కుటుంబానికి రోడ్డు ప్ర‌మాదాలు శాపంగా మారాయి. 2014లో పెద్ద కొడుకు జాన‌కీరామ్ రోడ్డు ప్ర‌మాదంలోనే మృతి చెందారు. అంత‌కు ముందు ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్టీఆర్ కారు ప్ర‌మాదంలో చిక్కుకోవ‌డం అభిమానుల్ని క‌ల‌ర‌వ‌పెట్టింది. ఆసుప‌త్రి ప‌డ‌క మీద‌నే ఎన్టీఆర్ టీడీపీకి ప్ర‌చారం చేసి పెట్టాడు. ఇప్పుడు హ‌రికృష్ణ కూడా కారు ప్రమాదంలోనే మృతి చెంద‌డం మ‌రో పెను విషాదం. దాంతో రోడ్డు ప్ర‌మాదాల‌కూ.. ఆ కుటుంబానికీ ఏదో ఉంద‌ని నంద‌మూరి అభిమానులు క‌న్నీరు పెట్టుకుంటున్నారు. నిజానికి హ‌రికృష్ణ‌కు డ్రైవింగ్‌లో మంచి ప‌ట్టు ఉంది. ఎంత వేగంగా వెళ్లినా.. నియంత్రించుకోగ‌ల‌రు. ఈరోజు ఆయ‌న బండి ఏకంగా 160 కిలో మీట‌ర్ల వేంగంతో వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని నిర్థార‌ణ అయ్యింది. ఆ స్థాయిలో బండి న‌డ‌ప‌డం ఎవ‌రికైనా, ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే. ఆ స‌మ‌యంలో హ‌రికృష్ణ సీటు బెల్టు పెట్టుకుని ఉంటే, క‌నీసం ప్రాణాలైనా ద‌క్కేవి. హ‌రికృష్ణ‌తో పాటు ఉన్న మ‌రో ముగ్గురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. వాళ్లు స్వ‌ల్ప గాయాల‌తో త‌ప్పించుకోగ‌లిగారు. వాహ‌నం న‌డుపుతున్న ర‌ధ‌సార‌ధి మాత్రం అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోవాల్సివ‌చ్చింది.

ఐ మిస్ యూ అన్నా: విషాదంలో నాగార్జున‌

నాగార్జున పుట్టిన రోజు ఇంత విషాద వార్త‌తో మొద‌ల‌వుతుంద‌నుకోలేదు. ఈరోజు నాగ్ పుట్టిన రోజు అనే సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే రోజు నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో ప‌రిశ్ర‌మ యావ‌త్తూ షాక్‌కి గురైంది. సంతోషంగా పుట్టిన రోజు జ‌రుపుకోవాల్సిన నాగార్జున కూడా విషాదంలో మునిగిపోయారు. నాగార్జున‌కీ, హ‌రికృష్ణ‌కీ మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రూ క‌ల‌సి ‘శివ‌రామ‌రాజు’ చిత్రంలో న‌టించారు. ”చాలా రోజులు అయ్యింది.. నిన్ను చూసి. క‌ల‌వాల‌ని వుంది త‌మ్ముడూ” అంటూ ఈమ‌ధ్యే నాగార్జున‌కు ఫోన్ చేశార్ట హ‌రికృష్ణ‌. ఇంత‌లోనే ఇలా జ‌రిగిపోయిందంటూ.. ట్విట్ట‌ర్లో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `ఐ మిస్ యూ అన్న‌య్యా` అంటూ ట్వీట్ చేశారు నాగార్జున‌. హరికృష్ణ మృతితో నాగ్ పుట్టిన రోజు కార్య‌క్ర‌మాల‌న్నీ ఆగిపోయాయి. ఈరోజు `దేవ‌ద‌స్‌` తొలి పాట విడుద‌ల కావాల్సింది. అది కూడా వాయిదా ప‌డింది. టాలీవుడ్‌లో జ‌ర‌గాల్సిన కొన్ని కార్య‌క్ర‌మాల్ని చిత్ర‌బృందాలు వాయిదా వేశాయి. ఈ రోజు విడుద‌ల కావాల్సిన‌ `పందెంకోడి 2` టీజ‌ర్ కూడా వాయిదా వేశారు.

త‌న‌యుడి స‌మాధి ప‌క్క‌నే

నంద‌మూరి హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు గురువారం ఉద‌యం జ‌ర‌పాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించుకున్నారు. శంషాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో హ‌రికృష్ణ అంత్య‌క్రియలు నిర్వ‌హిస్తారు. 2014లో హ‌రికృష్ణ త‌న‌యుడు జాన‌కీరామ్ కూడా రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. జాన‌కీరామ్ అంత్య‌క్రియ‌లు కూడా ఇదే ఫామ్ హౌస్‌లో నిర్వ‌హించారు. ఇప్పుడు త‌న‌యుడి స‌మాధి ప‌క్క‌నే హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. కాసేప‌ట్లో హ‌రికృష్ణ పార్థీవ‌దేహాన్ని హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహానికి తీసుకొస్తారు. ఇప్ప‌టికే హ‌రికృష్ణ ఇంటి కి వంద‌లాది అభిమానులు చేరుకున్నారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హ‌రికృష్ణ క‌డ‌సారి చూపుకు బ‌య‌ల్దేరారు.

కంట‌త‌డి పెట్టిన‌స్తున్న హ‌రికృష్ణ చివ‌రి లేఖ‌ :

నందమూరి హరికృష్ణ మృతి అభిమానుల్ని విషాదంలో ముంచెత్తింది. హ‌రికృష్ణ జ్ఞాప‌కాల‌తో చిత్ర‌సీమ త‌ల్ల‌డిల్లుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాసిన ఆఖ‌రి లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సెప్టెంబరు 2 హ‌రికృష్ణ పుట్టిన రోజు.

ఈ సంద‌ర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన ఇటీవల ఓ లేఖ రాశారు. కేర‌ళ‌లో పెను విషాదం చోటు చేసుకుంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో పుట్టిన రోజు చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, అభిమానులు కూడా కేర‌ళ వాసుల్ని ఆదుకునే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

‘‘సెప్టెంబరు 2న అరవై రెండో పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను“ అని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఆ లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com