బేసిగ్గా దీపావళి తెలుగు సినిమాలకు అన్ సీజన్. ఈ పండగ తమిళ సినిమాలకి పాజిటివ్ సెంటిమెంట్. కానీ కొన్నేళ్ళుగా ట్రెండ్ మారిపోయింది. దీపావళి కానుకగా చిన్న, మీడియం సినిమాలు బాక్సాఫీసు ముందు వచ్చి విజయాల్ని చూస్తున్నాయి. ఈ అక్టోబర్ లో కూడా సినిమాల సందడి కనిపించింది.
అక్టోబర్ తొలి వారంలో ధనుష్ ఇడ్లీ కొట్టు, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 చిత్రాలు వచ్చాయి. ఇందులో ఇడ్లీ కొట్టు డిజాస్టర్. ధనుష్ నుంచి కుబేర తర్వాత వచ్చిన సినిమా అనే బజ్ కూడా లేకుండా పోయింది. కంటెంట్ కూడా చాలా వీక్ గా వుంది.
కాంతార చాప్టర్-1 నిలబడింది. తెలుగులో టికెట్ రేట్లు పెంచడంతో కొంత నెగిటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్నప్పటికీ సినిమా విజువల్ గా మంచి ఫీల్ ఇచ్చింది. కలెక్షన్స్ కూడా బావున్నాయి. వరల్డ్ వైడ్ గా రూ. 800 కోట్ల పైచికులు వసూళ్ళు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు.
రెండోవారంలో శశివదనే, కానిస్టేబుల్, అరి సినిమాలు వచ్చాయి. ఈ మూడు కూడా ఆకట్టుకోలేకపోయాయి. శశివదనే ట్రైలర్ లో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ కనిపించింది. కానీ థియేటర్ కి జనం రాలేదు. అనుసూయ, సాయి కుమార్ లాంటి సీనియర్లు కనిపించిన అరి సినిమా పరిస్థతి కూడా అంతే. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ అనే సినిమా చేశాడని కూడా చాలా మందికి తెలీదు.
దీపావళి కానుకగా 4 సినిమాలు వచ్చాయి. ప్రియదర్శి ‘మిత్రమండలి’ ని బన్నీవాస్ కాస్త పరుషమైన మాటలతో పబ్లిసిటీ చేసి వదిలారు. ప్రిమియర్స్ కే సినిమా జాతకం డిజాస్టర్ అని తేలిపోయింది. కామెడీ కాస్త ట్రాజడీ అయ్యింది. రెండో రోజు నుంచి యూనిట్ లో ఒక్కరూ కూడా సినిమా గురించి మాట్లాడలేదు.
కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ కి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా కంటెంట్ కూడా వీక్. అయితే కిరణ్ అబ్బవరం ఈ సినిమా కోసం ఓ కొత్తరకం పబ్లిసిటీ చేసుకొంటూ వెళ్లాడు. బాలకృష్ణ, రాజశేఖర్ సినిమాల్లోని పాటలకు రీల్స్ లాంటి డ్యాన్స్ చేశాడు. అవే స్క్రీన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కిరణ్ థియేటర్స్ కి వెళ్లి డ్యాన్సులు చేశాడు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బజ్ ఇచ్చాయి. దాంతో బాక్సాఫీసు దగ్గర ఫర్వాలేదన్న స్థాయిలో వసూళ్లు దక్కాయి.
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాకి తెలుగులో కావాల్సినదాని కంటే ఎక్కువ పబ్లిసీటీ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. పైగా ప్రదీప్ లవ్ టుడే డ్రాగన్ లాంటి రెండు హిట్లతో వున్నాడు. ఆ బజ్ డ్యూడ్ కి కలిసొచ్చింది. ఆర్య 2 సినిమాని తలపించే ఈ కథ యూత్ ని ఆకట్టుకుంది. ప్రదీప్ రూ.100 కోట్ల హ్యాట్రిక్ కొట్టాడని ఓ ఈవెంట్ పెట్టిమరీ ప్రకటించారు మేకర్స్.
‘తెలుసు కదా’తో ఓ వినూత్నమైన సినిమా చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. నాలుగు పాత్రలతో నడిచే సినిమా ఇది. కంటెంట్ కొంచెం రాడికల్. అయితే ఇలాంటి సినిమాని ఆదరించే పరిస్థితి ఇంకా రాలేదని ఈ సినిమాకి వచ్చిన ఫైనల్ నెంబర్స్ చూస్తే అర్ధమైయింది.
చివరి వారం డబ్బింగ్ సినిమా బైసన్ వచ్చింది. విక్రమ్ కొడుకు ద్రువ్ హీరో. టెక్నికల్ గా మంచి సినిమా ఇది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ వన్ సైడ్ ఐడియాలజీతో వచ్చే సినిమాలకి తెలుగులో ఆదరణ దొరకడం కష్టమని చాలాసార్లు రుజువైయింది. బైసన్ కి కూడా అదే జరిగింది.
చివరిగా ‘బాహుబలి ఎపిక్’ రిలీజ్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. బాహుబలి ఎపిక్ ఆడుతుకున్న కొన్ని థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించడం ప్రభాస్ రాజమౌళి మ్యాజిక్ కి అద్దం పట్టాయి. మాస్ జాతర నవంబరు 1న విడుదలైనా, ప్రీమియర్లు ఒకరోజు ముందే పడ్డాయి. టెక్నికల్ గా అక్టోబరు 31నే విడుదల అనుకోవాలి. అయితే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇలాంటి మాస్, ముతక సినిమాలు చూడ్డానికి ఆడియన్స్ ఎంత వరకూ రెడీగా ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మొత్తానికి కాంతార చాప్టర్ 1తో ఈనెల బాక్సాఫీసుకు జోష్ వచ్చింది. దీపావళి సినిమాలు ఫర్వాలేదనిపించాయి. చివర్లో బాహుబలి ఎపిక్ మెరుపులు మెరిపించింది. ఎలా చూసినా.. బాక్సాఫీసుకు ఈనెలతో గిట్టుబాటు అయినట్టే.