మేమంతా ఓ కుటుంబం అంటుంటారు టాలీవుడ్ సెలబ్రెటీలు. అయితే వాళ్ల మధ్య లుకలుకలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉంటాయి. స్టార్ హీరోల సంగతి ఎలా ఉన్నా… హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, మరీ ముఖ్యంగా కమిడియన్ల ‘నువ్వా నేనా’ అనేంత పోటీ ఉంటుంది. టాలీవుడ్లో ఒక్కో సీజన్లో ఒక్కో కమెడియన్ ప్రతాపం చూపిస్తుంటాడు. అలా ఈ సీజన్లో ఓ కమిడియన్ దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చూసినా… అతగాడి కామెడీ బాగా వర్కవుట్ అవుతోంది. పేరడీ చేసినా.. పాత డైలాగే చెప్పినా.. అతను అంటుంటే భలే ఉంటుంది. అందుకే అతగాడి పాత్రలు బాగా క్లిక్ అవుతూ వచ్చాయి. ఈ కమిడియన్ రాకతో.. స్టార్ కమిడియన్ గా పేరొందిన మరో నటుడు సైడ్ అయిపోవాల్సివచ్చింది. ‘ఆ కమిడియన్ ఉంటే తప్ప సినిమా ఆడదు’ అనిపించుకొన్న ఆ స్టార్ కమిడియన్ .. ఈమధ్య బాగా వెనుక బడ్డాడు. దాదాపుగా ఆ స్థానాన్ని కొత్త హాస్యనటుడు ఆక్రమించుకొన్నాడు. ఈయనా రోజువారి వేతనం లెక్కన పనిచేసి బాగా సంపాదించేస్తున్నాడు. ఆ మత్తులో ఉండో ఏమిటో.. సదరు స్టార్ కమిడియన్ ఓసారి అవాకులూ.. చవాకులూ పేలాడట.
‘ఆయన లేకపోతే సినిమా ఆడదా.. అంత గొప్పోడా’ అన్నట్టు మాట్లాడాడట. అది ఆ నోటా… ఈ నోటా ఆయనకూ తెలిసిపోయింది. దాంతో ఫోన్ చేసి చెడామడా తిట్టేశాడట. ఇద్దరి మధ్య కాస్త గట్టిగానే వాగ్వీవాదం జరిగిందని, ఈ సంగతి మిగిలిన కమిడియన్లందరికీ తెలుసని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓసారి సెట్లో కలుసుకొని మళ్లీ పాత విషయాన్ని గుర్తు చేసుకొని మాటా మాటా అనుకొన్నార్ట. టాలీవుడ్లో బళ్లు ఓడలూ… ఓడలూ బళ్లూ అవ్వడం ఎంత సేపు? ఒకప్పుడు హాస్య నటులుగా చక్రం తిప్పిన వాళ్లు ఇప్పుడు మూలన పడిపోయారు. అవకాశాల కోసం పడిగాపులు గాస్తున్నారు. ఇప్పుడు వీళ్ల టైమ్ వచ్చిందంతే. ఆ మాత్రం దానికి ‘అంతా నేనే’ అనుకోవడం ఏమిటి? వెర్రి కాకపోతే..? తెరపై నవ్వించే వాళ్ల జీవితాల్లో ఇంత విలనిజం ఉంటుందన్నమాట.