ఇంటర్వ్యూలలో వైవిధ్యం కోసం యాంకర్లు, జర్నలిస్టులు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం చిన్న చిన్న సెగ్మెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. వాటిలో.. ఫ్రాంక్ కాల్ ఒకటి. గెస్ట్.. తనకు తెలిసిన ఓ సెలబ్రెటీకి ఫోన్ చేసి, కాస్త కంగారు పెట్టడం, అందులోంచి ఫన్ రాబట్టుకోవడం ఈ ఫ్రాంక్ కాల్ ముఖ్య ఉద్దేశ్యం. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు బెడసి కొడుతుంటాయి. ఫన్ పక్కన పెడితే… ఈ వ్యవహారం కాస్త ట్రాజెడీగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అదే జరిగింది.
త్వరలో రాబోయే ఓ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. దర్శకుడికి ఇదే తొలి సినిమా. ఇంటర్వ్యూలు జోరుగా ఇస్తున్నాడు. ఓ ఛానల్ వాళ్లు.. `హీరోకు ఫ్రాంక్ కాల్ చేసి సరదాగా ఆట పట్టించండి` అని అడిగారు. దర్శకుడు కూడా సరే అన్నాడు. హీరోకి ఫోన్ చేసి `మన సినిమా లీక్ అయిపోయింది..` అంటూ కాసేపు ఆట పట్టిద్దాం అనుకొన్నాడు. సినిమా లీక్ అనే సరికి.. హీరోకి కంగారు వచ్చేసింది. `పోలీస్ స్టేషన్ కి వెళ్దాం.. ఆ ఆఫీసర్ తో మాట్లాడదాం` అంటూ హీరో గారు యాక్టీవ్ పార్ట్ తీసుకొంటూ ఏం చేయాలో.. ప్లాను వేసుకోవడం మొదలెట్టారు. ఆ కాల్ దాదాపు 2 నిమిషాల పాటు సాగింది. హీరో పడుతున్న కంగారు చూసి పాపం.. డైరెక్టర్ కీ జాలి వేసింది. `ఇది ఫ్రాంక్ కాల్ సార్..` అని చివర్లో చెప్పేశాడు కూడా. కానీ.. హీరో కంగారు మాత్రం తగ్గలేదు. `ఇలాంటి విషయాల్లో ఫ్రాంక్ చేస్తారా` అంటూ కాల్ కట్ చేశాడు. దాంతో డైరెక్టర్ కిందా మీదా పడిపోతున్నాడు. హీరోకి ఎలా సర్దిచెప్పాలో ఆయనకు అర్థం కావడం లేదు. చివరికి ప్రొడ్యూసర్ రంగంలోకి దిగి.. హీరోకి సర్ది చెప్పాల్సివచ్చింది.
ఫ్రాంక్ కాల్స్ విషయంలో జాగ్రత్త. కొన్ని కాల్స్ సరదాగానే ఉంటాయి. ఇంకొన్ని ఇలా.. అనుకోకుండా సీరియస్ టర్న్ తీసుకొంటాయి.


