రాబో 2.0ని మార్కెటింగ్ చేసేందుకు శంకర్ భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ముంబైలో విడుదల చేయడం, వెనువెంటనే చెన్నైలోనూ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించడం ఇవన్నీ చూస్తుంటే… శంకర్ పెద్ద స్కెచ్‌తోనే రంగంలోకి దిగాడని అర్థమవుతోంది. టాలీవుడ్ స్టామినా రూ.600 కోట్లకు పైమాటే అని బాహుబలి సినిమా నిరూపించింది. కనీసం బాహుబలి దరిదాపుల్లోకైనా వెళ్లాలన్నది శంకర్ ప్రయత్నం. అలా చేయాలంటే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. ఆ విషయంపైనే సీరియస్‌గా దృష్టి సారించాడు శంకర్. ఈ సినిమా కోసం అక్షయ్‌కుమార్‌ని విలన్‌గా ఎంచుకొని బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేశాడు శంకర్. ఇప్పుడు అతని దృష్టి టాలీవుడ్‌పై పడిందని తెలుస్తోంది. టాలీవుడ్ మార్కెట్ తక్కువేం కాదు. సినిమా ఏమాత్రం బాగున్నా రూ.50 కోట్లు కొట్టేస్తుంది. దానికి తగ్గట్టు ఈ సినిమాకి భారీ రేట్లకే అమ్మాలని చూస్తున్నాడు శంకర్. అలా అమ్మాలంటే సినిమాలో ఏవో కొన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ కావాలి కదా? అందుకే ‘రోబో 2.0’ కోసం ఓ తెలుగు స్టార్‌ని తీసుకోవాలని చూస్తున్నాడు.
పెద్ద పాత్రేం కాదు.. అతిథి పాత్రలో అలా కనిపించి ఇలా వెళ్లిపోవాలన్నమాట. శంకర్ సినిమా… అందులోనూ రజనీకాంత్ హీరో, ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రాజెక్టు. ఎవరైనా సరే… గెస్ట్ రోల్ చేయడానికి రెడీ అయిపోతారు. కానీ… తన సినిమాకి ప్లస్ అయ్యే హీరో కోసం శంకర్ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో గెస్ట్ రోల్ అన్నట్టు కాకుండా.. కనీసం రెండు నిమిషాలైనా ఆ పాత్ర కనిపించేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడట. నిజానికి రోబో లాంటి సినిమాని తెలుగులో మార్కెట్ చేసుకోవడానికి శంకర్ ఏం కష్టపడక్కర్లెద్దు. కానీ.. తన దగ్గరున్న ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని శంకర్ భావిస్తున్నాడట. తెలుగులో తన సినిమాకి మరింత ప్రచారం చేసుకోవడానికి ఓ టాలీవుడ్ స్టార్ అండదండలు కావాల్సిందే అన్నది శంకర్ అభిప్రాయం. మరి ఆ పాత్రలో తెలుగు హీరో ఎవరు కనిపిస్తారో, శంకర్ చూపు ఏ స్టార్‌పై పడిందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.