కాల చక్రం గిర్రున తిరిగింది. మొన్ననే 2025 సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకొన్నట్టు అనిపించింది. ఇప్పుడు మరో సంక్రాంతి సీజన్ ముందుకొచ్చేసింది. గతేడాది ఎన్నో పాఠాలు. ఇంకెన్నో జీవిత సత్యాలు. వాటి నుంచి ఏం గ్రహించాం? ఎంత మారాం? అనేది ఈ యేడాది తేల్చి చెప్పబోతోంది. సినిమాలూ, వాటి ఫలితాల్ని పక్కన పెడితే.. గతేడాది మన హీరోలు చాలా కష్టపడ్డారు. 2026 డైరీ కూడా ఇంతే బిజీగా ఉంది. స్టార్ హీరోలు చేతి నిండా పని పెట్టుకొన్నారు. మరి వాళ్ల షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి? ఏయే సినిమాలతో అలరించబోతున్నారు?
చిరంజీవి
ఈ సంక్రాంతి సంబరాల్లో మెగాస్టార్ సినిమా కూడా ఉంది. ‘మన శంకర వర ప్రసాద్ గారూ’ అంటూ అభిమానుల్ని పలకరించబోతున్నారు చిరంజీవి. వేసవిలో ‘విశ్వంభర’ సినిమా రాబోతోంది. అంటే.. చిరు నుంచి బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలన్నమాట. బాబి డైరెక్షన్ లో ఓ సినిమా ఒప్పుకొన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఈ రెండు చిత్రాలూ సమాంతరంగా చేసే అవకాశం ఉంది. అంటే.. 2026 బాస్ ఫుల్ బిజీ అన్నమాట.
బాలకృష్ణ
సంక్రాంతి సినిమా అనగానే నందమూరి బాలకృష్ణ గుర్తొస్తారు. కాకపోతే ఈ సీజన్ లో ఆయన సినిమా లేదు. నెల రోజుల ముందే.. ‘అఖండ 2’తో అభిమానుల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలెక్కించారు బాలయ్య. ఈ యేడాదంతా ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉంటారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ యేడాది ఈ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే…’ఆదిత్య 999’ ఈ యేడాదే పట్టాలెక్కిస్తారు. అన్ స్టాపబుల్ కొత్త సీజన్ కూడా చూసే అవకాశం ఉంది.
నాగార్జున
గతేడాది నాగ్ నుంచి రెండు సినిమాలొచ్చాయి. ‘కుబేర’లో నాగ్ నటన, ‘కూలీ’లో స్టైలింగ్ ఆకట్టుకొన్నాయి. అయితే సోలో హీరోగా ఆయన సినిమా చేయలేదన్న అసంతృప్తి ఉంది. అది ఈ యేడాది తీరబోతోంది. 2026 నాగ్ కి స్పెషల్ ఇయర్. ఎందుకంటే ఆయన 100వ సినిమా ఈ యేడాదే విడుదల కాబోతోంది.
వెంకటేష్
‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో అతిథి పాత్రలో అలరించబోతున్నారు వెంకటేష్. ఆ రూపంలో ఈ పండక్కీ…. ఆయన ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కింది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. దృశ్యం 3 కూడా అతి త్వరలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు చాలా కథలు వెంకీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్నది ఆయన చేతుల్లో వుంది,
ప్రభాస్
పాన్ ఇండియా స్టార్స్ లో అత్యంత బిజీగా ఉండే హీరో.. ప్రభాస్. 2025 ఫుల్ బిజీగా సాగింది షెడ్యూల్. ఈ యేడాదీ అంతే. ఈ సంక్రాంతి పండక్కి ముందుగా పలకరించే సినిమా ఆయనదే. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2… ఇలా మూడు సినిమాల్ని ఆయన సమాంతరంగా పూర్తి చేయాల్సివుంది. ఫౌజీ ఈ యేడాదే విడుదల అవుతుంది. ఆ తరవాత స్పిరిట్, కల్కి 2 షూటింగులతో బిజీ అయిపోతారు. సలార్ 2 ఎప్పుడన్న సంగతి కూడా ఈ యేడాదే తేలుతుంది.
అల్లు అర్జున్
2025లో బన్నీ నుంచి సినిమా రాలేదు. కాకపోతే ఆ లోటు ఈ యేడాది తీరుతుంది. అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇదే ఏడాది పట్టాలెక్కిస్తారు. ఇది భారీ ప్రాజెక్ట్. కనీసం యేడాది పాటు షూటింగ్ సాగుతుంది. 2027లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. లోకేష్ కనగరాజ్, బోయపాటి శ్రీను కూడా బన్నీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ‘పుష్ప 3’ పైనా ఆశలు ఉన్నాయి. వీటికి సంబంధించిన అప్ డేట్ ఈ యేడాది తెలిసే అవకాశం ఉంది.
ఎన్టీఆర్
గతేడాది ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. ఆ సినిమా అభిమానుల్ని నిరాశ పరిచింది. పైగా డబ్బింగ్ బొమ్మ. ‘డ్రాగన్’ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2026లో కూడా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ లేదు. అంటే.. తారక్ అభిమానుల నిరీక్షణ ఈ యేడాది కూడా కొనసాగుతుందన్నమాట.
మహేష్ బాబు
2025లో మహేష్ నుంచి సినిమా రాలేదు. 2026లోనూ అంతే. రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ 2027లో వస్తుంది. అంటే… ఈ యేడాదంతా `వారణాసి`తోనే అన్నమాట. రాజమౌళి సినిమా అంటే ఆ రేంజ్ లో కష్టపడాలి. తప్పదు. దానికి తగ్గట్టే ప్రతిపలం లభిస్తుంది కాబట్టి, ఈ మాత్రం ఓపిక పట్టాల్సిందే.
రామ్ చరణ్
‘ఆర్.ఆర్.ఆర్’ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. కాకపోతే.. ఆ తరవాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ బాగా నిరాశ పరిచింది. లెక్క సరి చేయాలంటే `పెద్ది`తో హిట్టు కొట్టాల్సిందే. ఈ యేడాది మార్చిలో పెద్ది రాబోతోంది. దీనిపై భారీ’అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే చికిరి పాట సూపర్ హిట్టయ్యింది. పెద్ది తరవాత సుకుమార్ కాంబోలో ఓ సినిమా మొదలెడతారు. 2026 అంతా సుక్కు సినిమాతోనే.
పవన్ కల్యాణ్
2025లో పవన్ కల్యాణ్ నుంచి అనూహ్యంగా రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఫ్లాప్. రెండోది సూపర్ హిట్. 2026 లో పవన్ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చూడబోతున్నాం. ఈ యేడాదిలోనే పవన్ మరో సినిమా చేస్తారన్న టాక్ నడుస్తోంది. పవన్ కూడా కొన్ని కథలు వింటున్నారు. అన్నీ కుదిరితే.. 2026లో కూడా పవన్ నుంచి 2 సినిమాలు రావొచ్చు.
