మార్చిలో సాధారణంగా సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధంగా ఉండరు. ఎందుకంటే సినిమాల వరకూ ఇది బ్యాడ్ సీజన్. పరీక్షలు మొదలైపోతాయి. యువతరం అంతా ఆ హడావుడిలో ఉంటుంది. సంక్రాంతికి, వేసవి సీజన్‌కు మధ్య కాస్త స్తబ్దత ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సినిమాలు జోరుగానే వస్తున్నాయి. పెద్ద సినిమాల అలికిడి లేదు కానీ, బాక్సాఫీసు దగ్గర వినోదాలకు ఢోకా లేదు. ఈవారం కూడా 7 సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అయితే వాటిలో ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకొన్న సినిమా ఏదీ కనిపించడం లేదు. కేవలం మౌత్ టాక్ లే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాల్సిన పరిస్థితి.
ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో ‘కింగ్స్టన్’ ఒకటి. జీవీ ప్రకాష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. సముద్ర ప్రయాణంలో జాంబీలు ఎదురైతే ఎలా ఉంటుందన్నది కథ. సెటప్ అయితే కొత్తగా వుంది. ట్రైలర్లో విజువల్స్ బాగున్నాయి. జీవీకి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. కాకపోతే జాంబీల సినిమా కాబట్టి, మనవాళ్లు కాస్త దృష్టి పెట్టే అవకాశం ఉంది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘చావా’ ఈవారం తెలుగు డబ్బింగ్ రూపంలో విడుదల అవుతోంది. ఈ సినిమాని తెలుగులో చూడాలనుకొనేవాళ్లకు ఇది మంచి అవకాశం. పైగా గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పబ్లిసిటీ పరంగా ఢోకా లేదు. కాకపోతే ఇప్పటికే ఈ సినిమాని హిందీ వెర్షన్లో చూసేశారు. వసూళ్లు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.
వీటితో పాటు ఈ వారం రాక్షస, నారీ, రారాజు, శివంగి, పౌరుషం.. ఇలా చిన్న చిత్రాలు విడుదల అవుతున్నాయి. వెంకటేష్ – మహేష్ బాబు మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్ హంగామా మరోసారి థియేటర్లలో చూసే వీలు దక్కింది. ఇప్పటికే టీవీల్లో ఈ సినిమాని చాలాసార్లు చూసేశారు. థియేటర్లో చూస్తే ఆ మజా వేరు కాబట్టి, మహేష్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించే అవకాశం వుంది.