సంక్రాంతి తరవాత బాక్సాఫీసు దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. వారం వారం కొత్త సినిమాలు వస్తున్నా, బాక్సాఫీసు ముందు ఒక్కటీ నిలబడలేకపోతోంది. మీడియం రేంజ్ సినిమాలదీ ఇదే పరిస్థితి. వేసవి సీజన్లో పెద్ద సినిమాలు వరుస కడుతున్నాయి. వాటితో అయినా జోష్ వస్తుందన్నది ఇండస్ట్రీ వర్గాల ఆశ. కాకపోతే వారం వారం ఏవో కొన్ని సినిమాలు వస్తుండడంతో థియేటర్లకు కాస్త ఫీడ్ దొరికేది. ఈవారం అయితే అది కూడా లేదు.
ఈ శుక్రవారం బాక్సాఫీసు ఖాళీగా అయిపోయింది. కొత్త సినిమా ఒక్కటీ రావడం లేదు. ఈనెల 19న `ఉస్తాద్ భగత్ సింగ్` విడుదల అవుతోంది. 18 నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి. పెద్ద సినిమా వస్తోందంటే, థియేటర్లో మరో సినిమా కనిపించదు. ఓ వారానికి ముందు కూడా సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసించరు. అందుకే ఈవారం బాక్సాఫీసు ఖాళీ అయిపోయింది. గతవారం విడుదలైన ‘మృత్యుంజయ్’ సో..సో మార్కులు తెచ్చుకొంది. కొన్ని థియేటర్లలో సినిమా ఆడుతున్నా, టికెట్లు మాత్రం తెగడం లేదు. కొన్ని చిన్న సినిమాలు రెడీగా ఉన్నా.. ఈవారం ఎందుకో నిర్మాతలు సాహసించలేదు. ‘రాకాస’, ‘బ్యాండ్ మేళం’, ‘సతీ లీలావతి’ లాంటి సినిమాలు రెడీగా ఉన్నా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసం చేయలేకపోయారు. సంక్రాంతి తరవాత.. థియేటర్లకు రావడానికి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదన్నది నిర్మాతల భావన. ఓ పెద్ద సినిమా వచ్చి, దానికి హిట్ టాక్ వచ్చి, కాస్త చలనం కలిగితే.. అప్పుడు మళ్లీ జోష్ వస్తుందని నమ్ముతున్నారు. అది.. ‘ఉస్తాద్’ తో అయినా జరుగుతుందేమో చూడాలి.