మే నెల ఇండియన్ హిస్టరీలో చాలా కీలకంగా నిలిచింది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ని లాంచ్ చేసింది. ఒక వారం రోజుల పాటు పూర్తిగా యుద్ధ వాతావరణమే కనిపించింది. అయితే ముందుగానే విడుదల తేదీలు లాక్ చేసుకున్న సినిమాలు ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు వచ్చాయి. కానీ సక్సెస్ శాతం మాత్రం అంత గొప్పగా లేదు.
మే 1న హిట్ 3 వచ్చింది. నాని చేసిన వైల్డ్ సినిమా ఇది. తెరపై మొత్తం రక్తపాతం. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తి కలిగించడంతో సినిమాపై హైప్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టుగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నాని మొదటి వారంలో యుఎస్ ప్రమోషన్లకు వెళ్లాడు. రెండో వారం లోకల్ ప్రమోషన్స్ చేయాలని అనుకున్నాడు, కానీ అదే సమయంలో యుద్ధ పరిస్థితి మొదలైంది. ప్రేక్షకుల మూడ్ మారిపోయింది. అటు నాని కూడా జనాల్లోకి రాలేదు. వంద కోట్ల గ్రాస్ వచ్చినట్లు పోస్టర్లు వేసుకున్నారు కానీ రెండో వారంలోనే సినిమా డౌన్ అయిపోయింది.
మే 9న శ్రీవిష్ణు నటించిన సింగిల్, సమంత నిర్మించిన శుభం సినిమాలు విడుదలయ్యాయి. శ్రీవిష్ణు కేవలం నవ్వించడానికి అన్నట్టుగా “సింగిల్” చేశాడు. కొన్ని నవ్వులైతే ఉన్నాయ్. అయితే సినిమా యుద్ధ సమయంలో విడుదలైంది. నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి సైనికులకు సాయం ప్రకటించారు. “ఈ పరిస్థితిని ఊహించలేకపోయాం, తప్పని పరిస్థితిలో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది” అంటూ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కామెడీ కోరుకునే ప్రేక్షకులు సినిమాను బాగానే చూశారనే రిపోర్ట్స్ వచ్చాయి. నిజానికి హిట్ లక్షణాలు ఉన్న సినిమా ఇది. సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా వుంటే సూపర్‌హిట్ అయ్యేది. సమంత నిర్మించిన శుభం మాత్రం థియేటర్లలో ప్రభావం చూపించలేకపోయింది.
తర్వాత 23, లెవెన్ సినిమాలు వచ్చాయి. మల్లేశం దర్శకుడు రాజ్ తీసిన 23కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ పుట్ ఫాల్స్ కనిపించలేదు. నవీన్ చంద్ర లెవెన్ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు కానీ సినిమా వర్కౌట్ కాలేదు.
మే చివరి వారంలో భైరవం, షష్టిపూర్తి సినిమాలు విడుదలయ్యాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు కలిసి నటించిన ఈ సినిమా గరుడన్ రీమేక్. ఈ ముగ్గురూ తమ కెరీర్లో బ్రేక్ తీసుకున్నవారే. అయితే ఈ సినిమాపై ఖలేజా రీరిలీజ్ ఎఫెక్ట్ కనిపించింది. విడుదలైన రెండు రోజుల్లో రెండు ప్రెస్ మీట్లతో టీం సందడి చేస్తోంది కానీ బుక్ మై షో వంటి యాప్స్‌లో బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇక షష్టిపూర్తి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
మే నెలలో హిట్3, సింగిల్ ఈ రెండు సినిమాలే నిలబడగలిగాయి. మే అంటే వేసవి హాలిడేలు, పైగా ఐపీఎల్ కూడా కొంతకాలం వాయిదా పడింది. అయినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో పెద్దగా ఆసక్తి చూపించని ట్రెండ్ కనిపించింది. జూన్‌లో కొన్ని మంచి సినిమాలు కనిపిస్తున్నాయి. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.