ఈమధ్య ఓ పెద్దాయన ఓ మాట అన్నారు. ఓ సినిమా వల్ల నష్టపోయేది నిర్మాత.. టికెట్ కొనే ప్రేక్షకుడు మాత్రమే అని. అది నూటికి నూరు పాళ్లూ నిజమే అనిపిస్తోంది. ఓ ఫ్లాప్ సినిమా తీస్తే నిర్మాత డబ్బులు పోతాయి. ప్రేక్షకుడి జేబులోంచి వందో – నూట యాభై రూపాయలో గల్లంతు అవుతాయి. వీళ్లు తప్ప మధ్యలో ఉన్నవాళ్లంతా లాభపడతారు. హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు, కార్మికులు అందరికీ డబ్బులొస్తాయి. పోయేది నిర్మాతకూ, ప్రేక్షకుడికి మాత్రమే.
అలాంటి నిర్మాత ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. సినిమాలు ఆడడం లేదు. మంచి సినిమా వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ పడిపోయాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న నిర్మాతలపై సినీ కార్మికుల సమ్మె మరో గుదిబండగా మారింది. చిన్నా, పెద్దా సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్ లూ అన్నీ కలిపి దాదాపుగా వంద ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇది సగటు నిర్మాతకు కోలుకోని దెబ్బ.
కార్మికులకు వేతనాలు పెంచడం సబబేనా? కాదా? అనేది పెద్ద డిబేట్. దాని గురించిన ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ అన్నింటికంటే పెద్ద సమస్య ఉంది. అది… యూనియన్ల పేరిట దోపిడీ. ఈరోజు చిన్న నిర్మాతలంతా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. తమ ఆవేదనని వెళ్లగక్కారు. ఒకొక్కరిదీ ఒక్కో కథ… ఒక్కో వ్యధ. అవన్నీ వింటుంటే.. `నిజంగా నిర్మాతని ఈ రకంగా దోచుకొంటున్నారా?` అనే అనుమానాలు, భయాలు ఏర్పడుతున్నాయి. ఇదే నిజమైతే కొత్త నిర్మాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సాహసమే చేయడు. ఉన్న నిర్మాతలకు ఎలాగూ మనుగడ లేదు. అలాంటప్పుడు చిత్ర సీమ భవిష్యత్తు ఏమిటి?
నిర్మాత మధుర శ్రీధర్ తన మాటల్లో ఓ చేదు నిజాన్ని బయట పెట్టారు. ఓ సినిమా షూటింగ్. హీరో – హీరో ఫ్రెండ్స్.. ఇద్దరే క్యారెక్టర్లు. ఆఫీసులో షూటింగ్ పెట్టారు. కేవలం ఇద్దరికి సంబంధించిన చిన్న సీన్ అది. అటూ ఇటుగా ఓ పది మంది టెక్నీషియన్లు ఉంటే సరిపోతుంది. కానీ యూనియన్ నిబంధనల ప్రకారం.. ఎనభైమంది సెట్లో ఉండాల్సివచ్చింది. మేకప్మెన్లు, కాస్ట్యూమర్లు, లైట్ బోయ్, కెమెరా అసిస్టెంట్లూ… ఇలా జనంతో ఆ ఆఫీసు ప్రాంగణం అంతా నిండిపోయింది. వాళ్లకు టిఫిన్లు.. భోజనాలు, వేతనాలు, బత్తాలు.. ఇలా ఖర్చు తడిసి మోపెడైంది. `షూటింగ్ అంటే ఇంతమందిని కచ్చితంగా తీసుకోవాల్సిందే` అనే రూల్ పాస్ చేసిందెవరు? దానికి నిర్మాతలంతా ఎందుకు కట్టుబడాలి? అనేది మధుర శ్రీధర్ ప్రశ్న. దీనికి ఎవరి దగ్గర సమాధానం ఉంది. కోటి రూపాయలతో సినిమా తీద్దామని పక్కా ప్లాన్‌తో వచ్చిన ఏ నిర్మాతా కోటి రూపాయల్లో సినిమా తీయలేకపోతున్నాడు. బడ్జెట్ రెండు రెట్లు.. మూడు రెట్లు దాటిపోతోంది. దీనికి కారణం యూనియన్ రూల్స్ కావా? అనేది సగటు నిర్మాత ఆవేదన.
ఫారెన్ లొకేషన్లను మ్యాచ్ చేస్తూ హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. అంతా ఫారెన్ నటులే. ఇక్కడి వాళ్లతో సంబంధం లేదు. కానీ యూనియన్ నిబంధనల ప్రకారం.. ఆ సెట్లో మనవాళ్లు ఉండాల్సిందే. వాళ్లు సెట్ కి వస్తారు. రోజంతా కాలక్షేపం చేస్తారు. తమ పారితోషికం పట్టుకొని వెళ్లిపోతారు. వాళ్లతో అవసరం లేదు కదా? అని ప్రశ్నిస్తే – చెల్లుబాటు కాదు. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. వీటికి అరికట్టాలన్నదే నిర్మాతల ఆలోచన.
ప్రతిభావంతమైన టెక్నీషయన్లకు 30 శాతం వేతనం పెంచడం నిర్మాతలకు సమస్యే కాదు. కానీ ఆ వేతనం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదన్నది నిర్మాతల చేతుల్లో ఉండాలి. యజమాని ఓ పని చేయించుకొంటున్నాడంటే.. నౌకరుకి ఎంత ఇవ్వాలి? అనేది తన చేతుల్లోనే కదా ఉండాల్సింది. ఓ పనిని ఒకరు చాలా నైపుణ్యంగా చేస్తారు. ఇంకొకరు అత్తెసరు జ్ఞానంతో చేస్తారు. ఎలాంటి నౌకరిని నియమించుకోవాలి అనేది యజమాని ఇష్టానుసారం జరగాలి కదా. అది చిత్రసీమలో జరగడం లేదు. దీన్ని నివారించాలన్నదే నిర్మాతల ప్రయత్నం.
ఇది వరకు చాలాసార్లు స్ట్రైక్ జరిగింది. కానీ నిర్మాతలు ఇంత పట్టుదలతో లేరు. ఇప్పటిలా ఇదివరకెప్పుడూ తమ గోడు వినిపించలేదు. ఈసారి మాత్రం వాళ్ల ఆవేదనకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నిర్మాతల వెర్షన్ వింటుంటే – కార్మికులవి గొంతెమ్మ కోర్కెలే అనిపించకమానదు. వేతనాలు పెంచమని అడిగే హక్కు వాళ్లకుంది. ఇదెవ్వరూ కాదనలేని విషయం. కానీ.. సమర్థులైన కార్మికులనే ఎంచుకొనే అవకాశం కూడా నిర్మాతలకు ఇవ్వాలి. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావు లేదు.