సినిమా ఇండస్ట్రీ అంటే పైన పటారం.. లోన లొటారం. అన్నీ పైపై మెరుగులే. మేడి పండు ముసుగులే. పోస్టరుపై ఉన్న కోట్లు… నిర్మాత బ్యాంకు అకౌంట్లో ఉండవు. నవ్వులన్నీ కెమెరా ముందే. వెనుక మాత్రం కన్నీళ్లు కష్టాలే. టాలీవుడ్ లో పేరు మోసిన బడా నిర్మాణ సంస్థది కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఆ నిర్మాణ సంస్థకు చేతి నిండా సినిమాలే. అందులో పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆ సంస్థ నుంచి అడ్వాన్సు తీసుకోని హీరోలు, దర్శకులు లేరేమో? యేడాదికి వందల కోట్ల టర్నొవర్ చేస్తున్న ఆ నిర్మాణ సంస్థ ప్రస్తుతం ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. కేవలం చేసిన అప్పులకే నెలకు దాదాపుగా రూ.10 కోట్ల వరకూ చెల్లించాల్సివస్తోందని సమాచారం. నెలకు పది కోట్లంటే మాటలు కాదు. యేడాదికి రూ.120 కోట్లన్నమాట. ఈలోగా సంస్థ నెలవారీ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు ఇవన్నీ లెక్క వేసుకొంటే.. తడిసి మోపెడు అవుతోంది. అంటే.. యేడాదికి కనీసం రూ.200 కోట్ల ఆదాయం లేకపోతే.. ఆ సంస్థ మనుగడ కష్టం అన్నమాట. రూ.200 కోట్లు ఆర్జించాలంటే ఎన్ని సినిమాలు చేయాలి? అందులోంచి ఎన్ని లాభాలు గడించాలి?
ఏ నిర్మాత అయినా కొంత వరకే సొంతంగా పెట్టుబడి పెడతాడు. మిగిలినవి ఫైన్సాన్సే. కానీ సినిమా విడుదల సమయంలో ఆ ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేయాల్సిందే. బయటి సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తే విడతల వారీగా చెల్లించొచ్చు. అలా ఈ సంస్థ చేతికందని చోటల్లా అప్పులు చేసి, సినిమాలు తీయడం మొదలెట్టింది. ఆ అప్పులు పెరిగి.. వడ్డీలు కొండంత అయ్యాయి. దాంతో నెలాఖరు వచ్చేసరికి నిర్మాతలకు కంగారు మొదలవుతోంది. చేతిలో సినిమాలన్నీ పూర్తయి, ఓటీటీ డబ్బులు తిరిగి వస్తే ఈ అప్పుల బెడద తగ్గుతుందని ఆ సంస్థ భావిస్తోంది.
ఇలానే మరో సంస్థ కూడా ఈమధ్య వరుస పరాజయాల పాలైంది. చేతిలో ఉన్న సినిమాలన్నీ ప్రస్తుతం వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి మొదలెట్టినవే. కొత్తగా ఏ దర్శకుడికైనా, హీరోకైనా అడ్వాన్సు ఇవ్వాలంటే కొత్త అప్పులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. నెలకు దాదాపు రూ.5 కోట్ల వడ్డీ రూపంలో కట్టాల్సివస్తోందట. వరుసగా రెండు మూడు భారీ హిట్లు పడితే కానీ… ఈ నిర్మాణ సంస్థల బాధలు తీరవు.


