హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె, తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత రాజేశ్ -చిన్న నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. లెక్క చూస్తే 150 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ సెట్ లో 50 మంది కూడా ఉండరు. వాళ్లకు ఇస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది. ఓటీటీ, డబ్బింగ్ సినిమాలకు డబ్బులు ఏవీ టైంకు రావట్లేదు. కానీ, మేం మాత్రం ఏ రోజుకి ఆ రోజు డబ్బులివ్వాలంటే అయ్యే పనేనా?. అన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి– ఒక చిన్న సీన్ చేయాలనుకుని జెనరేటర్ పెట్టాలన్నా యూనియన్ పర్మిషన్ కావాలి. హీరో, ఫ్రెండ్ సీన్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్లకు వడ్డించే ప్రొడక్షన్..ఇలా 80 మందిని పెట్టుకోవాలి. చిన్న నిర్మాతకు ఇంతమందిని పెట్టుకోవడా పెనుభారంగా మారింది. వాస్తవానికి అక్కడ పనిచేసేది ఆరుగురు మాత్రమే. మిగతా వాళ్లకు పేమెంట్స్ ఇవ్వాలి. ఇంత మందిని మా నెత్తిన రుద్దడం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. అన్నారు.
నిర్మాత వంశీ నందిపాటి – చిత్ర నిర్మాణం భారంగా మారుతోంది. రెండు కోట్ల రూపాయల్లో చేయాల్సిన సినిమాకు నాలుగైదు రెట్ల ఖర్చు అవుతోంది. మా దగ్గరకు రిలీజ్ చేయమని వచ్చే సినిమాలు చూస్తే 2 కోట్లలో చేయాల్సినవి అనిపిస్తాయి కానీ వాళ్లు నాలుగైదు రెట్లు ఎక్కువ అయ్యింది అని చెబుతారు. థియేటర్స్ నుంచి అంత డబ్బులు రావడం లేదు. ఇంత ప్రొడక్షన్ ఖర్చు ఎందుకు అవుతోంది. సినీ కార్మిక సంఘాలు ఒకసారి నిర్మాత స్థానంలోకి వచ్చి ఆలోచిస్తే మా బాధలు తెలుస్తాయి. అన్నారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని – మేమంతా ఇండస్ట్రీకి ప్యాషన్ తో వచ్చాం. సినిమాలు చేస్తున్నాం. యూనియన్స్ పేరుతో మాకు భారాన్ని పెంచవద్దని కోరుతున్నాం. ఈ యూనియన్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిబంధనలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్చాలి. తక్కువ మంది తో సరిపోయే షూటింగ్ లో 100, 150 మందిని పెట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఒక సెట్ కోసమో, ఇంకో క్వాలిటీ కోసమే మేము పెట్టాల్సిన ఖర్చు ఇలా వృథా అవుతోంది.
నిర్మాత ఎస్ కేఎన్ – ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే.
మాకు పదవులు లేవు, మాట్లాడేందుకు పెదవులు తప్ప.
ఇది గ్రూపిజం కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాదు. చిన్న నిర్మాతలుగా మా బాధలు చెప్పుకునేందుకు పెట్టిన ప్రెస్ మీట్.
పరిస్థితి అర్థం చేసుకుని ముందు మంచి సినిమా చేద్దామని ముందుకొచ్చారు. అలాంటి హీరోలు ఎంతమంది ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీకు 30శాతం కావాలని ఎలా అడగాలని అనిపిస్తోంది. టికెట్ రేట్సు పెంచుకునేంది వేళ్ల మీద లెక్కపెట్టేన్ని సినిమాలకే.
మేము రైజింగ్ ప్రొడ్యూసర్స్ కాదు బర్నింగ్ ప్రొడ్యూసర్స్.
మాది మేకపోతు గాంభీర్యమే. చాలా మంది నిర్మాతలకు ఏంటి అని మాట్లాడుతున్నారు.
డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎవరి వైపు ఉన్నారో స్పష్టత ఇవ్వాలి.
మీరు డిమాండ్స్ మాత్రమే చేసి హక్కులు మర్చిపోతే ఎలా.
మీరు మారకుంటే మా బడ్జెట్ లో వచ్చేవాళ్లతో సినిమాలు నిర్మించుకుంటాం.
ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అనడం లేదు. పరిస్థితి అర్థం చేసుకుని సినిమాలు చేస్తున్నారు.
యూనియన్స్ కూడా ఇది మన ఇండస్ట్రీ మన ప్రొడ్యూసర్స్ అనే భావనతో పనిచేయాలి. అన్నారు.