టాలీవుడ్లో షూటింగులు నిలిచిపోయాయి. వేతనాలు పెంచాలని గత కొద్దిరోజులుగా ఫెడరేషన్ సమ్మెకు దిగింది. ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా ఈ అంశంపై నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఈ రోజు సుదీర్ఘంగా జరిగిన సమావేశం అనంతరం కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నాం. అయితే కొన్ని షరతులు ఉన్నాయని చెప్పారు.
”2018, 2022లో జరిగిన అగ్రిమెంట్స్లో ఉన్న రెండు షరతులను వాళ్లు అమలు చేయడం లేదు. ముందు వాటిని ఒప్పుకోవాలి. వీటితో పాటు మరో రెండు షరతులు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఛాంబర్ ద్వారా వాళ్ల దృష్టికి తీసుకొచ్చాం. వాటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే, వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమే” అన్నారు.
ప్రస్తుతం సానుకూల ధోరణిలో చర్చలు జరుగుతున్నాయని దిల్ రాజు చెప్పినప్పటికీ, సమ్మె విరమణ అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరో రెండు, మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉందని దిల్ రాజు చెబుతున్నారు. తమ విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంపు అన్నట్లుగా స్పష్టం చేశారు దిల్ రాజు. అయితే మొదటి నుంచి ఈ పాయింట్ దగ్గరే ఫెడరేషన్, నిర్మాతల మధ్య సంధి కుదరడం లేదు. మరి ఈ సమ్మె ఇంకెంత కాలం కొనసాగుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకం.