టాలీవుడ్ కి సంబంధించి 2025 క్యాలెండర్ ముగిసింది. 2026 లో కొత్త పేజీ ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. జనవరి 1 నుంచే బాక్సాఫీసు ముందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ యేడాది టాలీవుడ్ కు శుభారంభం దక్కాలన్నది అందరి కోరిక. జనవరి 1న ప్రేక్షకుల్ని కొత్త సినిమాలు పలకరించబోతున్నాయి. కాకపోతే అన్నీ చిన్న సినిమాలే. సంక్రాంతి సీజన్ కు ముందు కొత్త సినిమాల్ని విడుదల చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కొంతమంది చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు చేశాయి.
జనవరి 1న రాబోతున్న చిత్రాల్లో ‘సైక్ సిద్దార్థ్’ ఒకటి. డిసెంబరు లోనే ఈ సినిమా విడుదల కావాల్సివుంది. అయితే `అఖండ 2` వల్ల ఆలస్యమైంది. సురేష్ బాబు చేతుల్లోకి ఈ సినిమా వెళ్లడంతో కాస్త ప్రమోషన్ దక్కింది. హీరో నందు కూడా గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. రానాతో కొన్ని కామెడీ స్కిట్లు డిజైన్ చేసి వదులుతున్నాడు. ఇవన్నీ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేవే. ప్రమోషన్ కంటెంట్ కూడా ఆకట్టుకొనే రీతిలో వుంది. ‘వనవీర’, ‘సకుటుంబానాం’ లాంటి చిన్న సినిమాలు కూడా ఈవారం క్యూ కట్టాయి. వీటితో పాటు నీలకంఠ’, `45` అనే చిత్రాలు జనవరి 1నే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వెంకటేష్ సూపర్ హిట్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాల విషయంలో ప్రేక్షకులకు ఎంత శ్రద్ద ఉంది? ఫుట్ ఫాల్స్ ఎలా ఉండబోతున్నాయి? అనే విషయాలు పక్కన పెడితే కొత్త యేడాది బాక్సాఫీసు ముందు కాస్తయినా సందడి కల్పించే అవకాశాన్ని ఇచ్చాయి.
కాకపోతే సంక్రాంతి సీజన్‌కు ముందు సినిమాల్ని విడుదల చేయాలనుకోవడం రిస్కే. జనవరి 9న రాజాసాబ్ రాబోతోంది. ప్రభాస్ సినిమా వస్తే, బాక్సాఫీసు అంతా ఆయన చేతుల్లోకి వెళ్లిపోవాల్సిందే. జనవరి 1న విడుదలైన సినిమాలకు మంచి టాక్ వచ్చినా, వాటి స్పాన్ కేవలం వారం రోజులు మాత్రమే. ఎలాంటి అద్భుతం జరగాలన్నా ఈ వారంలోనే జరిగిపోవాలి. మరి సంక్రాంతి సీజన్ హీట్ తట్టుకొని, హిట్ కొట్టే సినిమా ఏదో చూడాలి.
