ఎండాకాలం వస్తే… బాక్సాఫీసుకు రెండు రకాల సమస్యలు. మార్నింగ్ షోలకు ఎండలతో భయం. ఉష్ట్రోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతూ పోవడంతో ఆ ఎఫెక్ట్ బాక్సాఫీసుపై పడుతోంది. రాత్రుళ్లయితే ఐపీఎల్ హడావుడి ఉంటుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు రెండేసి మ్యాచ్‌లతో ప్రేక్షకుల్ని థియేటర్ల నుంచి దూరం చేస్తున్నారు. సినిమాలకు యువతరమే మహారాజ పోషకులు. వాళ్లు ఐపీఎల్ తో కాలక్షేపం చేస్తుంటే, థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి.
ఈవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘బైకర్’, ‘రాకాస’ బాక్సాఫీసుని పలకరించాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం, శనివారంతో పోలిస్తే ఆదివారం ఈ సినిమాల వసూళ్లు బాగున్నాయి. కాకపోతే మండే టెస్ట్ లో ఈ రెండు సినిమాలకూ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. బుక్ మై షో ఓపెన్ చేస్తే, కనిపించేవన్నీ పచ్చ తోరణాలే. పొద్దుట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి మార్నింగ్ షోలకు జనం ఆసక్తి చూపించడం లేదు. పైగా వర్కింగ్ డే. టాక్ బాగుంటే వీక్ డేస్ లో ఈవినింగ్ షోస్ ఫుల్ అవతాయి. కానీ.. ఆ సమయంలో ఐపీఎల్ ఉంది. అందుకే… కలక్షన్లు కనిపించడం లేదు. ఈ రెండు సినిమాలే అని కాదు. ఈమధ్య కాలంలో ఎంత మంచి సినిమా అయినా తొలి మూడు రోజులే వసూళ్లు ఉంటున్నాయి. మండే టెస్ట్ లో సినిమా నిలబడడం చాలా కష్టం అవుతోంది.’పెద్ది’ లాంటి సినిమాలు వస్తే తప్ప వీక్ డేస్ లో థియేటర్ల దగ్గర సందడి కనిపించదు. అందుకే అందరి దృష్టీ ‘పెద్ది’పై పడింది.
ఈ వేసవిలో వ్యాపారం అంటే బార్లు, రెస్టారెంట్లదే. రాత్రయితే యంగ్ బ్యాచ్ అంతా సరదాగా ఐపీఎల్ చూస్తూ బార్లలో సేద తీరుతున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఐపీఎల్ సమయంలో ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. దాంతో.. యూత్ అంతా వీకెండ్స్ లో, వీకె డేస్ లో అక్కడ రిలాక్సయిపోతోంది.