ఆంధ్రా ఒడిశా బోర్డర్లో కొద్దిరోజుల కిందట భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మావోయిస్టులకు ఇది కోలుకోని దెబ్బ అని చెప్పాలి. అయితే, ఈ ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే ఆచూకీ లేకుండా పోయారు! గడచిన రెండు రోజులుగా ఆయన ఆచూకీపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నారని వరవరరావు అంటున్నారు. లేదు లేదు, ఎక్కడో చోట అడవుల్లో క్షేమంగా ఉంటారని పద్మక్క అంటున్నారు! ఒకవేళ ఆర్కే తమ అదుపులో ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం ఏముంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఆయన ఏమయ్యారు అనేది మాత్రం ఇప్పటికీ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఈ గందరగోళ పరిస్థితికి మరింత టెన్షన్ యాడ్ చేస్తూ శుక్రవారం నాడు కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి! వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి వేణు పేరుతో వచ్చిన ప్రకటన! ఎన్కౌంటర్ పేరుతో ఆర్కేను పోలీసులు దారుణంగా చంపేశారని అన్నారు! చలపతి, అరుణలు అక్కడి నుంచి తప్పించుకున్నారనీ, కానీ ఆర్కే మాత్రం బలైపోయారని చెప్పారు. ఇదంతా పోలీసులు ఆడుతున్న నాటకమనీ, ఆర్కే మృతదేహాన్ని కూడా వారే ఎక్కడో మాయం చేశారనీ, నిజానిజాలు బయటకి రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, వేణు పేరుతో వెలువడ్డ ప్రకటన కూడా పోలీసులు ఆడుతున్న డ్రామాగా కొట్టిపారేశారు పౌర హక్కులసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్. ఆర్కే ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటారని ఈయన అంటున్నారు! ఎన్కౌంటర్లో అమాయకులైన గిరిజనుల్ని కూడా పోలీసులు దారుణంగా కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు.
కుమారుడు మున్నా మరణంతో దుఃఖ్ఖంలో ఉన్నారు పద్మక్క. తన భర్త ఎక్కడున్నా ప్రజలే కాపాడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ, ఆ తరువాత ఆయన స్పందించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, భారీ ఎన్కౌంటర్ జరిగిన తరువాత కూడా ఆర్కే పేరుతో ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం గమనార్హం! ఆర్కే మా అదుపులో లేరని ఏపీ డీజీపీ సాంబశివరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంపేశారని వేణు పేరుతో ప్రకటన వెలువడింది! లేదు, ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారని వరవరరావు లాంటి వారు ఆరోపిస్తున్నారు. ఇంతకీ, ఆయన ఎక్కడున్నట్టు..?