రెండు తెలుగు రాష్ట్రాలలో కనీస సాంప్రదాయాలు ఫిరాయించకుండా పార్టీలు ఫిరాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యే గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తుతున్నాయి. వారిని ఫిరాయింపులకు ప్రోత్సహించిన ఇద్దరు ముఖ్యమంత్రులు సహితం ఇరకాటంలో పడుతున్నారు. అందుకు ప్రధానంగా తాజాగా జరిగిన రెండు పరిణామాలు దోహదం చేస్తున్నాయి.
మొదటగా తెలంగాణ శాసన సభలో అధికార పార్టీలోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనానికి పంపింది. ఇప్పటి వరకు ఫిరాయింపు విషయమై ఒక నిర్ణయం తీసుకోవలసింది స్పీకర్ అని, కోర్ట్ లు జోక్యం చేసుకోరాదని, ఒకవేళ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నచ్చని పక్షంలో అప్పుడు కోర్ట్ కు వెళ్లవచ్చని ప్రభుత్వాలు వాదిస్తూ వస్తున్నాయి.
అందుకనే స్పీకర్లు ఆయా సభ్యుల పదవీకాలం పూర్తయ్యే వరకూ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఎప్పటి లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్ట్ బెంచ్ అడిగితే స్పీకర్ ను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని అంటూ తెలంగాణ అడ్వకెట్ జనరల్ వాదించారు. ఇప్పుడు ధర్మాసనం ఈ విషయమై స్పీకర్ లకు మార్గదర్శక సూత్రాలు రూపొందింస్తే స్పీకర్ ఖచ్చితంగా సత్వరం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
దానితో రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయించి, తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా కూడా చేయని వారి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారనున్నది. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల నుండి సుమారు 50 మంది దాకా ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయించారు.
మరోవంక రాష్త్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాలలో శాసన సభా స్థానాలను 2026 లోగా పెంచడం సాధ్యం కాదని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం సహితం రెండు రాష్ట్రాలలో రాజకీయ దుమారం లేపనున్నది.
పార్టీలు మారిన వారిని వారి నియోజక వర్గాలలో అధికార పక్షాలకు చెందిన నేతలు ఇప్పటివరకు దగ్గరకు చేర్చుకోవడం లేదు. అయితే నియోజక వర్గాల సంఖ్య పెరుగనున్న దృష్ట్యా పార్టీ మారిన వారితో పాటు, ఇదివరకటి నుండి పార్టీలో ఉన్నవారికి సర్దుబాటు చేస్తూ 2019లో సీట్లు ఇస్తామని అంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు నచ్చచెబుతూ వస్తున్నారు.
సీట్లు పెరిగే అవకాశాలు లేవని స్పష్టం కావడంతో ఈ నాయకుల మధ్య ఇప్పుడు పలు నియోజక వర్గాలలో ఘర్షణలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు తమ రాజకీయ భవిష్యత్ పట్ల ఆందోళనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చివరకు ఎవరికి టిక్కెట్లు దొరుకుతుందో తేలని పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలోని అసంతృప్తి దారులకు నచ్చ చెప్పడం ముఖ్యమంత్రులకు సహితం సమస్యగా మారనున్నది.