కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం! త్వరలోనే కరెన్సీ కష్టాలు తీరిపోతున్నాయన్న నాయకుల కవ్వింపు వ్యాఖ్యల్నీ పక్కకు నెట్టేద్దాం. విమర్శల్నీ కొద్ది సేపు విడిచిపెడదాం. ఎలాంటి ముందస్తు అభిప్రాయాలూ మైండ్‌లో పెట్టుకోకుండా.. కేవలం వాస్తవాలు మాట్లాడుకుందాం. నెలరోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. పోనీ, మరో నెలలోపు తీరిపోతాయన్న ఆశా లేదు! ఎందుకంటే, కరెన్సీ నోట్ల ముద్రణ జరుగుతున్న తీరు తెలిస్తే… మార్కెట్లోకి సరపడా నోట్లు వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో అనే ఒక ప్రాథమిక అంచనాకి రావొచ్చు.
పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల్లోకి డిపాజిట్ల రూపంలో దాదాపు రూ. 12.44 లక్షల కోట్ల వరకూ చేరాయని చెబుతున్నారు. రాబోయే పదిహేను రోజుల్లో మరింత సొమ్ము చేరే అవకాశం ఉంది. సో… ఈ లెక్కన ఎంత మొత్తంలో డిపాజిట్ చేరితే… అంతే మొత్తంలో కొత్త నోట్లను బ్యాంకుల ద్వారా ప్రజల్లోకి తీసుకురావాలి. కానీ, ఇక్కడే అసలు సమస్య ఉంది! కొత్త నోట్ల రూపంలో ఆర్బీఐ ఇంతవరకూ మార్కెట్లోకి పంప్ చేసింది రూ. 4.61లక్షల కోట్లు అని చెబుతున్నారు. అంటే, ఇంకా దాదాపుగా తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల విలువగల కొత్త నోట్లను బ్యాంకులకు ఆర్బీఐ ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఇవ్వడం లేదూ… అంటే, ప్రింటింగ్ ప్రాబ్లమ్!
ప్రస్తుతం దేశంలో నాలుగు చోట్ల నోట్ల ప్రింటింగ్ జరుగుతోంది. రోజుకి మూడు షిఫ్టులలో నాన్ స్టాప్‌గా నోట్లు ముద్రిస్తున్నారు. ఇలా దివారాత్రాలు కొట్టినా సరే రోజుకి దాదాపు రెండువేల కోట్లు మాత్రమే ముద్రించగలుగుతున్నారు. ప్రస్తుతం కేవలం రూ. 500 నోట్ల ముద్రణే సాగుతోందట. చిన్న నోట్ల ముద్రణ కూడా కొన్నాళ్లు పక్కన పెట్టేసినట్టు సమాచారం. రోజుకి రూ. 2000 కోట్ల చొప్పున ఎన్ని రోజులపాటు ముద్రిస్తే రూ. 10 లక్షల కోట్ల నోట్లను ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకురాగలదో ఊహించండి!
ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉందండోయ్! నోట్ల ముద్రణకు అవసరమైన ప్రింటింగ్ పేపర్ కూడా బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు క్యాష్ ఫ్లో పెంచేద్దామని తొట్రుపాటు పడుతున్న మోడీ సర్కారు 9 అంతర్జాతీయ కంపెనీల నుంచి పేపర్ కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా ఆ పేపర్ ఇండియాకి వచ్చెయ్యదు కదా! విదేశాల నుంచి షిప్పుల్లో ఇండియాకి ఆ పేపర్ షిప్పింగ్ కావాలంటే ఎన్నాళ్లు పడుతుంది..? కనీసం రెండు మూడు నెలలు పడుతుందట.
సో… వాస్తవ పరిస్థితులు ఇవి! ఈ కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్తే బాగుంటుంది కదా అనిపించొచ్చు. ఇవి చెబితే మోడీ సాబ్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టేగా! నోట్ల రద్దు తరువాత ఇంత ప్రాసెస్ ఉంటుందని ముందుగా ప్రధానికి తెలీదా..? కరెన్సీ నోట్ల ముద్రణపైనా, మనదేశంలో ఉన్న ముద్రణా యంత్రాల సామర్థ్యంపైనా ప్రాథమిక అవగాహన ఆయనకు లేదా అనే చర్చ ప్రజల్లో మొదలౌతుంది. అంతేకాదు, ఇవేవీ ఆలోచించకుండా యాభై రోజుల్లో అద్భుతం ఆవిష్కరిస్తా అని మోడీ ఎలా మాటిచ్చారన్నది మిలియన్ డాలర్ కశ్చన్..? ఈ వాస్తవాలు వారికి తెలియనవి కావు. అందుకే, దేశాన్ని నగదు రహితంవైపు నడిస్తున్నాం అంటూ కొత్త పలుకులు పలుకుతున్నారు.
సగటు భారతీయుడి కింకర్తవ్యం ఏమనగా… డబ్బు లేకుండా బతకడం అలవాటు చేసుకోవడం వినా తరుణోపాయం లేదు! కాబట్టి, గో క్యాష్ లెస్. అదెలాగో ఏమాత్రం అర్థం కాకుండా చెప్పడానికి చంద్రబాబు ఉన్నారు, కేసీఆర్ కూడా ఉన్నారు! ఆపైన ఏదో అద్భుతం జరుగుతోందని చెప్పడానికి మోడీ ఉన్నారు.
కొసమెరుపు: దేశంలో చెలామణిలో ఉన్న సొమ్మంతా డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి వచ్చేస్తుంటే… నల్లధనం ఏమైనట్టు..?