తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేది అర్థం కాని ఓ జడపదార్థంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన 30శాతం పదవీ కాలం పూర్తి అయింది. అయినా ఆరు మంత్రి పదవుల్ని మాత్రం ఇప్పటికీ భర్తీ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికి నెలకు ఒకటో, రెండో ముహుర్తాలు పెడుతూ వస్తున్నారు. ఆ ముహుర్తాలు దాటిపోతున్నాయి కానీ.. కొత్త మంత్రులు మాత్రం రావడం లేదు.
తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరో ముహుర్తం పెట్టారు. నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో అని చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఇలాగే చెప్పారు పీసీసీ చీఫ్. ఆశావహుల ఆశల్ని అలా మోసుకుంటూ తిరగడానికి ఆయన ఇలాంటి మాటలు చెబుతున్నారని నిజానికి ఆయనకూ తెలిసిన సమాచారం తక్కువేనన్న అనుమానాలు గాంధీ భవన్ లో వ్యక్తమవుతూనే ఉంటాయి.
ఇటీవల సీఎల్పీ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి .. మంత్రి పదవుల కోసం ధిక్కార ప్రకటనలు చేస్తే మీకే నష్టమని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని కూడా తెలిపారు. అంటే.. హైకమాండ్ వద్ద జాబితా ఉంది. ప్రమాణ స్వీకారం చేయించుకోండి అన్న సిగ్నల్ మాత్రమే రావాల్సి ఉంది. పదవుల పేర్లు బయటకు వచ్చాక ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆందోళనతో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మహేష్ కుమార్ పెట్టిన కొత్త ముహుర్తానికైనా మంత్రుల ఆశలు నెరవేరుతాయో లేదో మరి !