ఆయన ఓ అధికారి బదిలీ అయ్యారు. కానీ తాను బదిలీ కాకూడదనుకున్నారు. చాలా పలుకుబడి ఉంది. మంత్రుల వద్దకు వెళ్లారు. తనను బదిలీ చేసిన ఉన్నతాధికారికి ఫోన్ చేయించారు. బదిలీ ఆపేయాలని చెప్పించారు. తర్వాత రోజు ఆయన చేతుల్లో బదిలీ ఆపేశామని ఉన్న దగ్గరే పని చేయాలన్న ఉత్తర్వులు లేవు.. సస్పెన్షన్ ఉత్తర్వులు ఉన్నాయి. సినిమాల్లోనే ఇలా జరుగుతుందని అనుకుంటారు కానీ.. నిజంగానే హైదరాబాద్‌లో జరిగింది.
జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ ఇటీవల డిప్యూటీ కమిషనర్లను పాలనా మార్పుల్లో భాగంగా బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డి అనే డిప్యూటీ కమిషనర్‌ను అల్వాల్ సర్కిల్ నుంచి కవడిగూడ కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఆయన కవాడిగూడకు వెళ్లాలనుకోలేదు. బదిలీ ఉత్తర్వులను లెక్కచేయకుండా విధుల్లో చేరలేదు. అంతే కాదు తాను బదిలీని ఆపేయించుకుంటానని చెప్పి మంత్రితో పాటు పలుకుబడి ఉన్న వారితో కమిషనర్‌కు ఫోన్లు చేయించారు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన కమిషనర్ కర్ణన్.. కమీషనర్ ఆదేశాలను లెక్కచేయని చర్యగా గుర్తించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అల్వాల్ డిప్యూటీ కమీషనర్ గా ఉన్న సమయంలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణలో కూడా నిజమని తేలింది. ఇప్పుడు ఆయన పై పాత కేసులు కూడా బయటకు రానున్నాయి. లఆయనను ఏ మంత్రి కాపాడుతారోనని అధికారవర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.