యురీ ఉగ్రదాడితో యావత్ భారతంలో పాకిస్తాన్ పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలంటూ ఆసేతు హిమాచలం డిమాండ్ చేస్తోంది. అమర జవాన్ల త్యాగం వృథా కారాదని భారతీయులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. అమర వీరులకు నివాళులు అర్పిస్తూనే, పాపిష్టి దేశంపై విరుచుకు పడాలంటూ ఆక్రోశిస్తున్నారు.
పాకిస్తాన్ పట్ల అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే దానిపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఎడతెగని మంతనాలు జరుపుతోంది. అంతర్జాతీయంగా పాక్ ను ఏకాకిని చేయడం, ఉగ్రవాద దేశంగా ముద్రవేయడానికి ప్రయత్నించడం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. సైనిక చర్య విషయంలోనే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి అనుమతించాలంటూ సైన్యం కోరుతోంది. తమ సత్తా ఏమిటో పాకిస్తాన్ కు చూపించాల్సిన సమయం వచ్చిందని ఆర్మీ జవాన్లు కదన కుతూహలంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, అన్ని వర్గాల వారిని విశ్వాసంలోకి తీసుకున్న తర్వాతే సైనిక చర్యపై ఓ నిర్ణయానికి రావాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పాక్షికంగా సైనిక చర్యకు దిగడం వల్ల అంతర్జాతీయంగా భారత్ కు ఇబ్బంది ఉండదని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. తన దేశ ప్రజల రక్షణ కోసం శత్రు దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే హక్కు లేదని ఎవరూ అనే అవకాశం లేదంటున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంలో భారత్ కు వ్యతిరేక వైఖరి అవలంబించే అవకాశం లేదని సూచిస్తున్నారు.
బహుశా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాని మోడీ యోచిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినవస్తున్నాయి. అన్ని పార్టీల వారితో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి రావడం మంచిదని ఆయన భావిస్తున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల, దేశం మొత్తం ఏకతాటిపై ఉందనే సంకేతాన్ని ఇవ్వవచ్చు. భారత్ పరిణతితో ఆలోచించి నిర్ణయం తీసుకుందనే విషయం అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చూడటం మరో ఉద్దేశం కావచ్చు.
ఇది బీజేపీలోని విశ్వసనీయ వర్గాల అంచనా మాత్రమే. అధికారికంగా మాత్రం దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సూచనప్రాయంగానూ సంకేతాలేమీ బయటకు రాలేదు. దేశ ప్రజలంతా పాక్ పై ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలో, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయరాదనే విషయం మాత్రం కేంద్రానికి ఇప్పటికే అర్థమైంది. కాబట్టి రేపో మాపో తుది యాక్షన్ ప్లాన్ సిద్ధం కావచ్చు.