నివాళి : విశ్వ’నాథం’ మూగబోయింది

`జగమే మాయ, బ్రతుకే మాయ..వేదాలలో సారమింతేనయా…’ అంటూ తనకిష్టమైన పాట పాడుకుంటూ ఎంఎస్ విశ్వనాథన్ బ్రతుకు బంధాలను త్రెంచుకుని అనంత లోకాలకు పయనమయ్యారన్న వార్త , సంగీత అభిమానులను కలవరపరించింది. విశ్వనాథన్ గారు ఈరోజు (మంగళవారం – 14-07-2015) ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
సరిగా, గోదావరి మాత మహా పుష్కరాలు ప్రారంభమవుతున్న వేళలో తనలోని సంగీత జీవశక్తిని పవిత్ర జీవనదిలో మమేకం చేసుకున్నారేమో.
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటుగా తెలుగు చిత్రాలు (దేవదాసు, లైలా మజ్నూ, ఆకలి రాజ్యం, అంతులేని కథ, గుప్పెడు మనసు..) వంటి చిత్రాలకు స్వరాలను అందించారు.
దేవదాసు సినిమాకు సిఆర్ సుబ్రరామన్ గారు సంగీతం సమకూర్చినా, జగమే మాయ అన్న పాటకు మాత్రం వారికి సహాయకులుగా ఉన్న  విశ్వనాథన్ గారే స్వరాలు అందించారు.
జగమేమాయ…అంటూ సముద్రాల రాఘవాచార్య గారు ఏ క్షణంలో దేవదాసు కోసం ఈ పాట రాశారో కానీ, ఇప్పటికీ తెలుగువారి గుండె పిండేస్తునే ఉంది. అంతటి శక్తి దానికి ఎలా వచ్చిందని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే పాటరాసిన సముద్రాలవారిది అక్షర శక్తి అయితే, ఆ పాటకు సంగీత స్వర శక్తిని సమకూర్చింది ఎం.ఎస్ విశ్వనాథన్ గారే.
సీఆర్ సుబ్బరామన్ అప్పట్లో, దేవదాసు సినిమా పూర్తికాకముందే విషాదకర పరిస్థితుల్లో మరణించడంతో `జగమేమాయ’ పాటను విశ్వనాథన్ గారే స్వరపరిచారని చెబుతుంటారు. విశ్వనాథన్ గారికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవారు. ఆయన పేరు టికే రామ్మూర్తి (వాయిలిన్ వాద్య కారులు) వీరిద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు మ్యూజికల్ హిట్ అయ్యాయి. విశ్వనాథన్- రామ్మోర్తి సంగీత ప్రపంచంలో జంటకవుల్లాగా వెలిగిపోయారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత కూడా విశ్వనాథన్ గారు అనేక చిత్రాలకు చక్కటి సంగీతం అందించారు.
1928 జూన్ 24న కేరళరాష్ట్రంలో పుట్టిన విశ్వనాథన్ 13ఏళ్ల ప్రాయంలోనే సంగీతంలోని మెలుకువలు నేర్చుకున్నారు. 87 సంవత్సరాల జీవన యానంలో ఒడుదుడుకులు ఎన్నో ఎదురైనా, సంగీత సరస్వతే తనకు తోడుగా ఉంటూ సర్వకాల సర్వావ్యవస్థల అందూ తనను కాపాడిందని నమ్మిన వ్యక్తి. ఆయనో సంగీత ఋషి.
కె. బాలచందర్ అంటే విశ్వనాథన్ గారికి చాలా ఇష్టం. గత ఏడాది డిసెంబర్ లో బాలచందర్ గారు ఇక లేరన్న వార్త అందగానే, `మిత్రమా, నన్ను విడిచి వెళ్ళిపోయావా… ‘ అంటూ శోకించారు. బాలచందర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
పాటల స్వరకర్త ఎంఎస్ విశ్వనాథన్ పూర్తి పేరు మనయణ్గత్ సుబ్రమణ్యన్ విశ్వనాథన్. ఎంఎస్వీ గా కూడా చిరపరిచితులే. 2012లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ సంగీత సామ్రాట్ ను సత్కరించి 60 బంగారు నాణాలను, కొత్త కారును బహూకరించారు.
విశ్వనాథన్ గారు భౌతికంగా లేకపోయినా, వారందించిన సంగీత స్వరాలతో దక్షణాదిన కోట్లాది మంది గుండెల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. మహానుభావులకు మరణం లేదు. వారు మన మధ్యనే ఎప్పటికీ ఉంటారు ఇది నిజం.
– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com