తమిళనేతలు త్రిషనే టార్గెట్ చేస్తున్నారు. సినిమా గ్లామర్‌కు, రాజకీయ పవర్‌కు మధ్య ఉండే సన్నని గీతను అడ్డుపెట్టుకుని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిషను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న దాడులు, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రచార పిచ్చితో ఒక మహిళా నటిని ఇంత చులకనగా చూడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాజకీయ రొంపిలోకి త్రిష పేరు
గతంలో సేలం వెస్ట్ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎంతటి దిగజారుడుతనం ఉందో నిరూపించాయి. కూవత్తూరు రిసార్ట్ రాజకీయాల సమయంలో అప్పటి ఒక కీలక నేత కోసం త్రిషను తీసుకువచ్చారంటూ ఆయన చేసిన అత్యంత నీచమైన ఆరోపణలు కేవలం ఆమెనే కాకుండా, మొత్తం సినిమా రంగాన్నే అవమానించినట్లయింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టే క్రమంలో ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని బజారుకు ఈడ్చడం తమిళ రాజకీయాల్లో ఒక చెడు సంప్రదాయానికి తెరలేపింది.
ఇప్పుడు బీజేపీ నేతలు దాడి
తాజాగా తమిళనాడు బీజేపీ నేతలు సైతం విజయ్ రాజకీయ పార్టీ టీవీకే ను టార్గెట్ చేసుకునేందుకు ఆ పార్టీ నేత విజయ్ ను ఇబ్బంది పెట్టేందుకు కూడా త్రిషను ఆ వివాదాల్లోకి లాగడం, ఆమెను విజయ్‌తో లింక్ పెట్టి మాట్లాడటంతో ఆమె పేరు మరోసారి ఇబ్బందికరంగా ప్రచారంలోకి వచ్చింది. కేవలం రాజకీయ నేతలే కాదు, మీరా మిథున్ వంటి నటులు కూడా త్రిషను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. త్రిష తన అవకాశాలను లాగేసుకుంటోందని, ఆమెకు నెపోటిజం మద్దతు ఉందని ఆరోపిస్తూ వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మహిళా వ్యతిరేకతకు పరాకాష్ట. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించానని, కానీ అది జరగలేదని ఆయన బహిరంగంగా చెప్పడం వికృత మనస్తత్వానికి నిదర్శనం.
ధైర్యంగా నిలబడి పోరాడుతున్న త్రిష
తమిళ రాజకీయాల్లో సినిమా రంగం ఎప్పుడూ కీలకంగానే ఉంది. అయితే, ఒకప్పుడు నటీమణులను ఆరాధించిన నేతలే, ఇప్పుడు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వారిపై నిందలు వేయడం ఆశ్చర్యకరంగా మారింది. ఇలాంటి అంశాలపై త్రిష ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలను తనకు సంబంధం లేని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి చేస్తున్న రచ్చతో ఆమెకు సమస్యలు ఎదురు కాకుండా ఉండవు.
