ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య పేరుతో అల్లు కుటుంబం ఓ పురస్కారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు పేరరుతో ఈ పురస్కారం ప్రతీ యేటా అందజేస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, దాసరి నారాయణరావు ఈ పురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ యేడాది త్రివిక్రమ్‌కి ఈ అవార్డు అందజేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ వచ్చాక తెలుగు సినిమా హాస్యం కొత్త పుంతలు తొక్కడం మొదలైంది. డైలాగులలో ఓ ట్రెండ్ మొదలైంది. సకుటుంబ సపరివార సమేతంగా నవ్వించడం – త్రివిక్రమ్ స్టైల్. ఆయన నవ్వుల్లో వ్యంగం, తమాషా ఉంటుంది గానీ, ఎక్కడా.. అశ్లీలత, అసభ్యత ఉండదు. అందుకే… ఈ యేడాది అల్లు అవార్డు త్రివిక్రమ్‌కి ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. అవార్డులు అందుకోవడానికి త్రివిక్రమ్ ఏమాత్రం ఇష్టపడడు. ఆయన్ని ఒప్పించే బాధ్యత బన్నీకి అప్పగించినట్టు తెలుస్తోంది. బన్నీకీ, త్రివిక్రమ్‌కీ మధ్య మంచి దోస్తీ ఉంది. ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా మొదలైంది కూడా. త్వరలోనే ఈ అవార్డుపై ఓ ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది.