అగ్ర దర్శకుల్లో కాస్త ఖాళీగా కనిపిస్తోంది త్రివిక్రమ్ మాత్రమే! పవన్ కల్యాణ్ కోసం కథ రెడీ చేసుకొనే పనిలో ఉన్నారాయన. నవంబరుకి గానీ సినిమా మొదలవ్వదు. పవన్ కల్యాణ్ `స్పీడు` గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా వచ్చే యేడాదికి పోస్ట్ పోన్ అవుతూ వెళ్లినా… ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈలోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేసే ఛాన్సుంది. అందుకే కొంతమంది హీరోలు త్రివిక్రమ్ వెంట పడ్డారు. ‘మాకో సినిమా చేసి పెట్టరూ…’ అంటూ ఈ మాటల మాంత్రికుడ్ని కలుస్తున్నారు. మెగా హీరోల్లో అల్లు అర్జున్, పవన్ కల్యాణ్‌లతో సినిమాలు చేసేసిన త్రివిక్రమ్ రామ్‌చరణ్‌కి మాత్రం బాకీ పడ్డాడు. చరణ్‌కి త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో బయటపెట్టాడు కూడా. పవన్ కల్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్‌తో ఓ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని అప్పట్లో వార్తలొచ్చాయి. ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ చరణ ఆ ప్రాజెక్టుని ముందుకు కదిలించాలని తెగ ప్రయత్నిస్తున్నట్టు టాక్. మరోవైపు ఎన్టీఆర్ కూడా ‘త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంద’నే ఆలోచనలో పడిపోయాడట.
ఎన్టీఆర్ దాదాపుగా అగ్ర దర్శకులందరితోనూ పని చేశాడు. ఒక్క త్రివిక్రమ్‌తో తప్ప. దానికి తోడు త్రివిక్రమ్‌కీ, ఎన్టీఆర్‌కీ మధ్య మంచి రాపో కూడా ఉంది. ‘త్రివిక్రమ్ నేనూ మంచి స్నేహితులం. ఇద్దరం సినిమాల గురించి మాట్లాడుకొంటాం. కానీ కలసి పనిచేద్దాం అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. నిజానికి తనతో పనిచేయాలని నా మనసులో ఉంది’ అంటూ ఎన్టీఆర్ మనసులోని మాట ఇటీవలే బయటపెట్టాడు. అంతేకాదు.. త్రివిక్రమ్‌కి కూడా రాయబారాలు పంపుతున్నట్టు టాక్. జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ సినిమా ఏమిటన్నది ఇంత వరకూ కన్ఫామ్ కాలేదు. ఎవరితో అయినా పనిచేయడానికి ఎన్టీఆర్ సిద్దంగానే ఉన్నాడు. త్రివిక్రమ్‌కి ఎలాగూ పవన్‌తో సినిమాకి టైమ్ పట్టేట్టు ఉంది కాబట్టి… ఈలోగా ఈ కాంబినేషన్‌ని సెట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.