ఎన్టీఆర్ సినిమాలు హిట్ అవ్వొచ్చు.. ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ ఎన్టీఆర్ నటుడిగా మాత్రం ఎప్పుడూ అసంతృప్తి పరచలేదు. తన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎవరూ తక్కువగా మాట్లాడలేదు. కానీ `వార్ 2` విడుదలైన తరవాత.. బాలీవుడ్ లో ఓ ముఠా బయల్దేరింది. ఎన్టీఆర్ స్టామినాని తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ల పబ్బం గడుపుకొంటున్నారు. ‘వార్ 2’ బాలీవుడ్ జనాలకు సైతం నచ్చలేదు. ఈ సినిమాలో కథ బలంగా లేదు. క్యారెక్టరైజేషన్లు వీక్ గా ఉన్నాయి. టేకింగ్, మేకింగ్ అంతా పైపైన ఆడంబరాలే. కొన్ని వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. లాజిక్కులకు అందరి యాక్షన్ ఫీట్లు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇవన్నీ ఓకే. కానీ.. అయాన్ ముఖర్జీ టేకింగ్, యశ్ రాజ్ వైఫల్యాల గురించి మాట్లాడకుండా – ఎన్టీఆర్ నటనని టార్గెట్ చేయడం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. అంటే ఈ ఫ్లాప్ కి ఎవర్నో ఒకర్ని బలి పశువు చేయాలి కాబట్టి.. వాళ్లకు ఇప్పుడు ఎన్టీఆర్ దొరికాడన్నమాట.
కొన్ని రివ్యూలు, వీడియో విశ్లేషణలు పనిగట్టుకొని ఎన్టీఆర్ నటనలో దోషాలు వెతకడానికి ట్రై చేయడం వింతగా అనిపిస్తోంది. ఎన్టీఆర్ నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? వార్ 2లో ఎన్టీఆర్ అద్భుతంగా ఏం చేయలేదు. కాకపోతే వంకలు పెట్టేంత నటన కూడా ఎన్టీఆర్ లో కనిపించలేదు. వార్ 2 ఫస్ట్ షో పడిందో లేదో.. స్క్రీన్ షాట్లని షేర్ చేస్తూ, ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ రంగంలోకి దిగిపోయింది ఓ గ్యాంగ్. వాళ్ల ట్వీట్లు, వింత పోలికలు చూస్తుంటే ఇది పనిగట్టుకొని చేస్తున్న చర్య అనిపిస్తుంది ఎవరికైనా.
తెలుగు హీరోల్ని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్లని కిందకి లాగాలని చూడడం బాలీవుడ్ కి కొత్తేం కాదు. ఇది వరకు రామ్ చరణ్ ‘తుఫాన్’ సినిమా చేసినప్పుడూ ఇంతే. జరగాల్సిన డామేజీ కంటే ఎక్కువ డామేజీ జరగడానికి కారణం.. బాలీవుడ్ మీడియానే. ‘ఆదిపురుష్‌లో’ ప్రభాస్ లుక్స్ పై కూడా ఇలానే దారుణంగా కామెంట్లు చేశారు. దీనంతటికీ కారణం ఒక్కటే.. తెలుగు హీరోలు బాలీవుడ్ లో ఎదగ కూడదు. అక్కడ సినిమాలు చేయకూడదు. తెలుగులో డబ్ అయిన సినిమాలు హిందీలో ఆడొచ్చు. కానీ ఓ తెలుగు హీరో స్ట్రయిట్ గా హిందీలో సినిమా చేయకూడదు. ఇదీ వాళ్ల టార్గెట్. ‘వార్ 2’లో ఎన్టీఆర్‌ని టార్గెట్ చేసింది కూడా అందుకే.