ట్రోలింగ్ కి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది టాలీవుడ్. ఇక్కడ ప్రతీదీ ట్రోల్ మెటీరియలే. పెద్ద, చిన్న అని తేడా లేదు. స్టార్… కొత్తా అనే బేధం లేదు. తేడా వచ్చిందంటే ‘ట్రోల్’ తీస్తారు. దీని కోసం సోషల్ మీడియాలో సెపరేట్ గా ఓ బ్యాచ్ పని చేస్తుంటుంది. ఇది వరకు కూడా ట్రోలింగ్ వుంది. కానీ.. ఆ ట్రోలింగ్ కి ఓ వాల్యూ ఉండేది. మంచి – చెడు తేడా ఉండేది. ఎవరైనా నోరు జారితే.. అదుపు తప్పితే.. ట్రోలింగ్ కి గురయ్యేవారు. సినిమాల్లోని చిన్న చిన్న తప్పులు.. ట్రోలర్స్ కి మేతగా ఉపయోగపడేవి. ఇప్పుడు అలా కాదు. భూతద్దాలు పెరిగాయి. చిన్న చిన్న విషయాలు కూడా వదలడం లేదు. ఆఖరికి కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్… వీటిపై కూడా దృష్టి పెడుతున్నారు ట్రోలర్స్. సినిమా వాళ్లు ఓ కంటెంట్ వదలాలంటే భయపడిపోతున్నారు. ప్లస్సులు, మైనస్సులు, సోషల్ మీడియా రీచ్ తరవాతి సంగతి. ట్రోలింగ్ కి గురి కాకపోతే చాలు అనుకొంటున్నారు. ‘ట్రోలర్స్ కి దొరక్కుండా ఉండడం’ ఒక్కటే పరమావధి అయిపోయింది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హావా ఎక్కువ. ప్రతీ హీరోకీ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమ హీరో నుంచి ఓ అప్ డేట్ వస్తోందంటే వాళ్లు అలెర్ట్ అవుతారు. వీళ్లతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా సరంజామా సిద్ధం చేసుకొంటారు. ఎక్కడ ఎలాంటి మెటీరియల్ దొరుకుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఫ్యాన్స్ యాక్టీవ్ గా లేకపోతే.. యాక్టీవ్ ఫ్యాన్స్ కి పండగే. పాట, టీజర్, గ్లింప్స్, ట్రైలర్, లుక్… ఇలా ప్రతీదీ ట్రోలింగ్ మెటీరియలే. సోషల్ మీడియాలో పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ దొర్లుతూ ఉంటుంది. వాటికే ఎక్కువ ఫోకస్. ‘ఈ పాట బాగుంది.. ఈ లుక్ బాగుంది’ అని కామెంట్ చేస్తే ఎవరూ పట్టించుకోరు. అందులోని తప్పులు కోడి గుడ్డుమీద ఈకలు పీకట్టు పీకితే.. రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇదే యాంటీ ఫ్యాన్స్ కి బూస్టప్ ఇస్తుంది.
ప్రతీ హీరోకీ ఫ్యాన్స్ ఉన్నట్టే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. సాధారణంగా వాళ్లే ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటారు. తమ హీరో సినిమా ట్రోలింగ్ కి గురైతే… దాన్ని మనసులో పెట్టుకొని, మిగిలిన హీరో బయటకు వచ్చినప్పుడు సమాధానం చెబుతుంటారు. ఇదంతా ఓ ప్రహసనంలా మారిపోయిందిప్పుడు. అయితే రాను రాను ఈ ట్రోలింగ్ కి కూడా సినిమా వాళ్లు అలవాటు పడిపోతున్నారేమో అనిపిస్తోంది. ఇది వరకు ఇలా ట్రోలింగ్ కి గురైనప్పుడు మనసు కష్టపెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ‘ఇక్కడ ఇదంతా మామూలే’ అని లైట్ తీసుకొంటున్నారు. ఇంకొంత మంది ‘ఇదోరకమైన ప్రచారమే’ అని సర్దుకుపోతున్నారు. నెగిటివిటీలోనూ పాజిటీవ్నెస్ వెదుక్కొంటున్నారు. చూడాలి… ఈ ట్రోలింగ్ ట్రెండ్ ఇంకెన్నాళ్లో..!
