ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాలో పర్యటించారు. ఈ పర్యటన భారత్ కు అత్యంత కీలకం. మిత్రపక్షంగా ఇంత కాలం నమ్మిన అమెరికా.. వ్యక్తిగత ఈగోలతో నట్టేట ముంచుతున్న సమయంలో ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశం. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన భారత్ వణికిపోదని.. కానీ అమెరికాను వణికించే ఫార్ములాను తాము సిద్ధం చేసుకున్నామని సంకేతాలు పంపింది. అయితే అనూహ్యంగా దేశంలో కొంత మంది ప్రధానిపై ఉన్న వ్యతిరేకతతో భారత్ ను అవమానిస్తున్నారు.
ప్రధాని మోదీ ఏం చేసినా తప్పు పట్టడమేనా ?
చైనా ప్రధాని దగ్గర మోదీ బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని కొంత మంది విమర్శలు ప్రారంభించారు. నిజానికి అక్కడ ఉన్న భారత ప్రధాని మోదీ. వ్యక్తిగతంగా నరేంద్రమోదీ కాదు. వ్యక్తిగత పర్యటనలో ఆయన ఏం చేసినా.. పరువు తీసుకున్నారని విమర్శలు చేయవచ్చు. ఆయన తీరును ఎలా కావాలంటే అలా విశ్లేషించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన భారత ప్రధానిగా.. దేశ గౌరవాన్ని తీసుకెళ్లారు. ఎలా గౌరవం కాపాడాలో అయనకు తెలుసు.కానీ ఇప్పుడు ప్రతీ దాన్ని బూతద్ధంలో చూపిస్తూ… బాడీ లాంగ్వేజ్ పేరుతో దేశాన్ని కించ పరిచేపోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు.
రాజకీయంగా మోదీని వ్యతిరేకించవచ్చు కానీ …
దేశంలో ఉన్న ప్రజలంతా ప్రధాని మోదీని బలపరచాలని ఏం లేదు. ఆయనను బలంగా వ్యతిరేకించవచ్చు. విధానాలను ప్రశ్నించవచ్చు. కానీ ఆయన భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం .. ఈ గుడ్డి వ్యతిరేకతను చూపించకూడదు. ఆయన భారత గౌరవం. చైనాలో జరిగిన ఎస్సీవో సమ్మిట్ లో భారత్ కు మిగతా అన్ని దేశాల నుంచి ప్రాధాన్యత లభించింది. పుతిన్, చైనా భారత్ తో సంబధాలు మెరుగుపర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నించారు. భారత్ కూడా అంతే. చైనా, రష్యాలు.. అమెరికా మిత్రుల్ని దూరం చేయడానికి ఏమైనా చేస్తాయి. ఇప్పుడు భారత్ కు అందుకే గౌరవం పెంచుతున్నాయి. దానికి తగ్గట్లుగా దేశ వ్యహాలు కూడా ఉంటాయి. ఈ వ్యవహారాలను రాజకీయాలో ముడిపెట్టి.. మోదీని అవమానించాలని అనుకోవడం దేశాన్ని అవమానించడమే.
నేషన్ ఫస్ట్…
మన దేశంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య సైద్ధాంతిక విబేధాలు సహజం. అయితే ఈ విబేధాలు దేశాన్ని వ్యతిరేకించే వరకూ వెళ్లకూడదు. రాహుల్ గాంధీ గతంలో విదేశీ పర్యటనలు చేస్తూ.. అక్కడ భారత ప్రజాస్వామ్యం గురించి చులకనగా మాట్లాడేవారు. ఇండియాలో ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఇలా బయట దేశాల ముందు.. భారత్ పై వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశంపైనే చెడు ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారన్న బావన తీసుకు వచ్చారు. ఇది ఆయనకు చెడ్డపేరు తెచ్చింది. ఇప్పుడు కూడా కొంత మంది అలాగే చేస్తున్నారు. రాజకీయాలకు.. దేశ ఇమేజ్, ప్రయోజనాలకు ముడిపెట్టకూడదని ఈ రాజకీయ నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో ?