రేవంత్ కి పీసీసీ దక్కకుండా తెరాస కుట్ర చేస్తోందా?

ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌నీయ‌కుండా చేసేందుకు సొంత పార్టీలోవారే ప్ర‌య‌త్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఇంటిపోరుని ఆధిప‌త్య పోరుగా చూడొచ్చు. కానీ, అధికార పార్టీ కూడా ఇప్పుడు ఇదే ప్ర‌య‌త్నంలో ఉంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీన్ని రాజ‌కీయ క‌క్ష సాధింపు ధోర‌ణిలో భాగంగానే చూడాలి! గ‌తంలో, అంటే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలో చ‌క్రం తిప్పిన ఓ ప్ర‌ముఖ నేత ద్వారా అధికార పార్టీ వ్యూహం న‌డిపిస్తోంద‌ని రేవంత్ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది. రేవంత్ కి సంబంధించిన కొన్ని వ్య‌వ‌హారాల‌ను హైక‌మాండ్ దృష్టికి సదరు నేత ద్వారా తీసుకెళ్ల‌ి, ఆయ‌న‌కి పీసీసీ ద‌క్క‌కుండా చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని రేవంత్ వర్గం అభిప్రాయపడుతోంది.

తాజాగా, డెప్యూటీ క‌లెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డిని ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. దీని వెన‌క రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే కార్య‌క్ర‌మం ఉంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. అదెలా అంటే… శేరిలింగంప‌ల్లి మండ‌లం గోప‌న‌ప‌ల్లిలో ఐదెక‌రాల భూమిని సోద‌రుడితో క‌లిసి రేవంత్ రెడ్డి అక్ర‌మ మార్గంలో సొంతం చేసుకున్నార‌నేది ఆరోప‌ణ‌. దీనికి రెవెన్యూ అధికారులు కూడా స‌హ‌క‌రించానేది ప్ర‌భుత్వ విచార‌ణ‌లో తేల్చిందని అంటున్నారు. దీంతో, గ‌తంలో తాసిల్దారుగా ప‌నిచేసిన శ్రీ‌నివాస‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సీఎస్ కి రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ రిపోర్టు ఇచ్చారు. నిజానికి, ఈ భూమికి సంబంధించి 2015లో మ్యుటేష‌న్ జ‌రిగింది. అయితే, తాసిల్దారు అక్ర‌మంగా మ్యుటేష‌న్ కి పాల్ప‌డ్డార‌ని అప్ప‌ట్లోనే విజిలెన్స్ విచార‌ణ జ‌రిగింది. కానీ, చ‌ర్య‌లు ఇప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి.

ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ప‌ట్నం గోస యాత్ర చేస్తూ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పీసీసీ రేసులో ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా ప‌రిశీల‌న‌లో ఉంద‌నీ తెలిసిందే. ఒక‌వేళ రేవంత్ కి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కితే… ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద ఆయ‌న మ‌రింత తీవ్రంగా పోరాటం చేసే అవ‌కాశం ఉంటుంది. అధికార పార్టీకి కాంగ్రెస్ నుంచి త‌ల‌నొప్పి ఉందంటే అది కేవ‌లం రేవంత్ రెడ్డి ఒక్క‌రి వ‌ల్ల‌నే అనే అభిప్రాయం తెరాస‌లో ఉంది. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక ఇష్యూలోకి రేవంత్ ని లాగాల‌ని, త‌ద్వారా పీసీసీ ప‌ద‌వి ద‌క్క‌నీయ‌కుండా చేసే వ్యూహం అమ‌లు జ‌రుగుతోందంటూ రేవంత్ మ‌ద్ద‌తుదారులు అంటున్నారు. ఒక‌వేళ రేవంత్ త‌ప్పుచేసి ఉంటే గ‌తంలో ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌నీ, ఇప్పుడే ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఎందుకు ఉప‌క్ర‌మించింది అనేది వారి ప్ర‌శ్న‌?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com