ఆగస్ట్ 15వ తేదీన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసినప్పుడు ఆయన చేతులు గట్టిగా పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆయన మాత్రం తెలంగాణాలో వైకాపాని అసలు పట్టించుకోవడం లేదు. తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించేందుకు ఆగస్ట్ 20న అఖిలపక్ష సమావేశానికి మిగిలిన అన్ని పార్టీలని ఆహ్వానించి వైకాపాని మాత్రం ఆహ్వానించలేదు. దానితో ఆ పార్టీ నేతలు తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై మండి పడుతున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.శివకుమార్ లోటస్ పాండ్ కార్యాలయంలో సాక్షి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారు. జిల్లాల ఏర్పాటుపై పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కంటి తుడుపు చర్యగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కనీసం ఆ సమావేశానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. మిగిలిన పార్టీలనిటినీ ఆహ్వానించి మా పార్టీని మాత్రమే ఆహ్వానించకపోవడానికి అర్ధం ఏమిటి? తెలంగాణాలో మా పార్టీకి కూడా రాజకీయ గుర్తింపు కలిగి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజాభీష్టానికి అనుగుణంగా ఉండాలి. లేకుంటే మేము ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాటం చేస్తాము. మొన్న ఆగస్ట్ 15వేడుకలకి కూడా ప్రభుత్వం మా పార్టీని ఆహ్వానించలేదు. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి మాట్లాడుదామనుకొంటే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు. అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో గవర్నర్ కి వినతి పత్రాలు అందించవలసివస్తోంది,” అని అన్నారు.
వైకాపా తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడుతూ, “మేము కొత్తజిల్లాల ఏర్పాటుని వ్యతిరేకించడం లేదు అయినా ఎల్లుండి జరిగే అఖిలపక్ష సమావేశానికి మా పార్టీని ఆహ్వానించకుండా తెరాస ప్రభుత్వం అవమానిస్తోంది. అఖిల పక్ష సమావేశానికి మా పార్టీని ఆహ్వానించకపోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తాము. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి తెరాసలో చేరిపోయినంత మాత్రాన్న వైకాపా తెరాసలో విలీనం అయిపోయిందనుకొంటే అవివేకమే. వారిపై అనర్హత వేటు వేయనందుకు సుప్రీం కోర్టు తెలంగాణా శాసనసభ స్పీకర్ కి, ఆ ఎమ్మెల్యేలకి కూడా నోటీసులు పంపిన విషయం ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలియదా?” అని ప్రశ్నించారు.
తెలంగాణాలో వైకాపా సజీవంగా ఉన్నప్పటికీ ఏనాడూ అది ప్రజల తరపున నిలబడిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు లోటస్ పాండ్ కార్యాలయంలో సమావేశాలు పెట్టుకొని, వాటి గురించి సాక్షి మీడియాలో ప్రచురించుకోవడం తప్ప ఏనాడూ అది తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలైనా చేయలేదు. కనుక అది ఎన్నికలలో పోటీ చేస్తుందో లేదో దానికే తెలియదు. అయినప్పటికీ తమ పార్టీని ప్రభుత్వం గుర్తించాలని కోరుకొంటోంది. అదేమీ అసాధారణమైన కోరిక కాదు. ఆహ్వానం ఆశించడం సబబే. దానినీ ఆహ్వానించి ఉంటే అది అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా ప్రభుత్వానికే వంతపాడేది. కానీ ప్రభుత్వం వైకాపాని పట్టించుకోలేదు. అందుకు వైకాపా ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా సబబే. కానీ సమావేశానికి తమని ఆహ్వానించకపోతే రోడ్లెక్కుత్తామని బెదిరించడమే సిగ్గుచేటు.
దీనిపై మాట్లాడిన ఇద్దరు నేతలలో ఒకరు కెసిఆర్ ఏకపక్షంగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శిస్తే, మరొకరు జిల్లాల ఏర్పాటుకి మేము వ్యతిరేకం కాదని చెప్పడం గమనిస్తే ఆ విషయంలో వైకాపాకి స్పష్టత లేదని స్పష్టం అవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై వారికి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ అఖిలపక్ష సమావేశానికి తమని పిలవలేదనే బాదపడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడానికి తెలంగాణాలో వైకాపా నోరు కాళ్ళు, చేతులు కట్టేసి, సాక్షి మీడియాలో ప్రభుత్వాన్ని పొగుడుతూ వార్తలు, కధనాలు ప్రసారం చేస్తున్నా తెరాస ప్రభుత్వం మాత్రం వైకాపాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ఈవిధంగా అవమానిస్తోంది కూడా. ఇప్పటికైనా వైకాపా తన తీరు మార్చుకొంటుందో లేదో చూడాలి.