టిఆర్‌ఎస్‌కు ఏకపక్షం కాదు..

మీడియాలో గాని , రాజకీయ ప్రచారంలో గాని టిఆర్‌ఎస్‌కు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎదురులేనట్టు అనిపించినా క్షేత్రస్థాయిలో సమస్యలు వేరుగా వున్నాయని పరిశీలకులే గాక ఆ పార్టీ వారు కూడా చెబుతున్నారు. తెలంగాణలో రాజకీయం ఇకముందు కూడా మిశ్రమంగానే వుంటుందని, అందులో కాంగ్రెస్‌ మొదట తర్వాత ఇతర ప్రతిపక్షాలూ వుంటాయని ఒక అంచనా చెబుతున్నారు. ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి తమవైపు మొగ్గు వస్తుందని కాంగ్రెస్‌ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. టిఆర్‌ఎస్‌ అధినేత పదేపదే సమీక్షలు జరపడం హామీలివ్వడం, కులవారీ వ్యూహాలు ప్రకటించడం వెనక ఒక విధమైన అభద్రత దాగివుందని కూడా పార్టీలో ఆయన విమర్శకులు స్పష్టంగా చెబుతున్నారు. ఇదే సంగతి ఆయనకు చెప్పాలంటే తమకు అవకాశం దొరకడం లేదనీ, ఇప్పుడాయన సన్నిహితులలో ఒకరిద్దరు మినహా ధైర్యంగా విమర్శలు కూడా చెప్పేవారు లేరని ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. ఇప్పటికీ జిల్లాలలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని తీసుకోవడానికి కారణం కూడా క్షేత్రస్తాయిలో బలహీనతలేనని కూడా గుర్తు చేశారు. సింగరేణి ఎన్నికలలోనూ దెబ్బతినే అవకాశం వుందని అర్థమైనాకనే కెసిఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి చక్రం అడ్డు వేశారనీ, తర్వాత దాని ఆధారంగా తీవ్ర విమర్శలు చేశారని వివరించారు. తమ నాయకత్వం సరిగ్గా పనిచేయలేదని ఆయన ఒప్పుకోకతప్పలేదు కూడా. ఇప్పుడు గొర్రెల పథకంలోనూ మంత్రి తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారు. అయినా అసెంబ్లీ సమావేశాలతో అత్యధిక ప్రచారం పొందాలని కెసిఆర్‌ వ్యూహ రచన చేస్తున్నారు. తెలుగుదేశం కకావికలు కావడం, కాంగ్రెస్‌ నేత ఖరారు కాకపోవడం కలిసివచ్చే అంశాలుగా చూస్తున్నారు. కోదండరాంపై పదేపదే విమర్శలు కేంద్రీకరించడం ద్వారా కాంగ్రెస్‌పై నుంచి దృష్టి మరల్చడం, ఆయనను ముందే దెబ్బతీయడం అవసరమని కూడా అనుకుంటున్నారట. టిడిపితో పొత్తు వద్దని కూడా పార్టీలో ఒక భావం వున్నా విజయంపై విశ్వాసం కోసం కెసిఆర్‌ ఎన్నో కొన్ని సీట్టు ఇచ్చి వెంట పెట్టుకోవాలని అనుకుంటున్నారట. మైనార్టి ముస్లింల విషయంలోనూ బాహాటంగా మజ్లిస్‌తో కలసి వ్యవహరించేందుకు వెనుకాడ్డం లేదు. వీటన్నిటిలో వ్యూహం కన్నా ఆందోళనే ప్రధాన పాత్ర వహిస్తుందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.