ప్రొ.నాగేశ్వర్: నేరుగా పొత్తు కోసం బీజేపీ..! రహస్య బంధం చాలంటున్న టీఆర్ఎస్..!!

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ మధ్య లోపాయికారీ అవగాహన ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిజంగానే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కుచ్ కుచ్ హోతా హై… అని చెప్పుకోవచ్చు. ఆ కుచ్ కుచ్ అంటే.. ఏమిటన్నది.. ఇక్కడ ఆసక్తికరం. నేరుగా పొత్తు పెట్టుకుందామని.. టీఆర్ఎస్ ను బీజేపీ అడుగుతోంది. కానీ కేసీఆర్ మాత్రం.. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. రహస్యంగానే… బంధం కొనసాగిద్దామనే ప్రతిపాదనే కొనసాగిస్తున్నారు. నిజానికి బీజేపీలోనూ రెండు వాదనలు ఉన్నాయి. ఎందుకంటే… టీఆర్ఎస్ తో నేరుగా పొత్తు పెట్టుకుంటే.. బీజేపీకి కొన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. విడిగా పోటీ చేస్తే… బీజేపీకి ఇప్పుడున్న సీట్లు కూడా నిలుపుకోవడం కష్టమే.

టీఆర్‌ఎస్‌తో నేరుగా పొత్తులు కోరుకుంటున్న బీజేపీ..!?

తెలంగాణలో ప్రస్తుత రాజకీయాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఓట్లు పోలరైజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలా పోలరైజ్ అయినప్పుడు.. బీజేపీకి పెద్దగా ఓట్లు రావు. 2014లో గ్రేటర్ లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సీమాంధ్ర ఓటర్లు టీడీపీ – బీజేపీకి మద్దతు ఇచ్చారు. అందుకే మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్ సభ సీట్లు, నగరంలో మెజార్టీ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పై గతంలో ఉన్నంత వ్యతిరేకత లేదు. పైగా బలపడింది. టీడీపీతో బీజేపీకి పొత్తు లేదు. సీమాంధ్ర నుంచి వచ్చిన ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు కూడా నిలుపుకోవడం కష్టమే. అందుకే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే… ఆ సీట్లు నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో బీజేపీలో మరో అభిప్రాయం కూడా ఉంది. టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. అది పరోక్షంగా కాంగ్రెస్ బలపడటానికి కారణం అవుతుంది. జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలపరచడం ఎందుకన్న వాదన కూడా..కొంత మంది బీజేపీ నేతలు వాదన వినిపిస్తున్నాయి.

ఎన్నికల తర్వాత మద్దతు గురించి ఇప్పుడు ఎన్ని చెప్పినా నమ్మరు..!

కేసీఆర్ ను లోక్ సభ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసించారు. తెలంగాణకు వచ్చే కేంద్రమంత్రులు, ఇతర నేతలు కూడా కేసీఆర్ ను పొగుడుతూంటారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా టీఆర్ఎస్ వైఖరి కూడా సానుకూలంగా ఉంటోంది. నోట్ల రద్దు, జీఎస్టీ , జమిలీ ఎన్నికలు సహా అన్ని విధానాలకూ మద్దతు తెలిపారు. చివరికి మోడీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా మద్దతివ్వలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చారు. అయినా… సరే.. బీజేపీతో బహిరంగ పొత్తుకు టీఆర్ఎస్ రెడీగా ఉంటుందా అన్నదే ప్రశ్న. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో కలుస్తానని కేసీఆర్ చెప్పినా అది పెద్ద వ్యాలిడ్ కాదు. ఎందుకంటే.. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి.. కేసీఆర్ అప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కేసీఆర్ పైన.. బీజేపీకి అలాంటి సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉండదు. ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి.తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయినా పాటింలేదు. అలాగే.. కాంగ్రెస్, బీజేపీలు.. కేసీఆర్ ఎలాంటి హామీలు ఇచ్చినా నమ్ముతారన్న గ్యారంటీ లేదు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయమార‌్పులు..!

2019 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అవసరం ఉంటుందా..? అవసరం ఉండదా..? అనేది అప్పుడు తేలుతుంది. కానీ ఇప్పుడు… సంస్థాగతంగా బలపడాలి అంటే.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల.. కొన్ని సీట్లు వస్తాయి. దీనితో భవిష్యత్ లో అయినా పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్న ఓ ఆలోచన బీజేపీలో ఉంది. రాజకీయాలన్న తర్వాత రకరకాల అభిప్రాయాలు వస్తాయి. వాటిలో ఏది తప్పో.. ఏది ఒప్పో.. కాలమే చెప్పాలి. వంద శాతం ఎవరూ అంచనా వేయలేరు. బీజేపీకి ఉన్న సమస్య ఏమింటంటే… డిసెంబర్ లో జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ప్రాంతీయ పార్టీల్లో ఓ కదలిక వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలవాలనుకుంటున్న పార్టీలు కలుస్తాయి. అటూఇటుగా ఉన్న పార్టీలు కూడా.. కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.

ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం..!

ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ లాంటి పార్టీలు.. కాంగ్రెస్ తో ఉండడమో.. ఉండటానికి సిద్ధపడాలనే ఆలోచనలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలు.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సిద్దంగా లేరు. కానీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. కాంగ్రెస్ తో కలిసే అవకాశం ఉంది. ఇక మూడో రకం పార్టీలు.. అటు కాంగ్రెస్ తో కానీ.. ఇటు బీజేపీతో కాని లేనివి. తెలంగాణలో టీఆర్ఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే. ఒడిషాలో బీజేడీ లాంటివి. వీటిలో టీఆర్ఎస్ ది ప్రత్యేక పరిస్థితి. ఆ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి. ఒడిషాలో బీజేడీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎంకే… ఈ పార్టీ కాంగ్రెస్ తో ఉంది కాబట్టి.. అన్నాడీఎంకే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లదు. అందుల్ల మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కి పాజిటివ్ వైబ్రేషన్ వస్తే.. వీటిలోనూ కదలిక వస్తుందా అన్న అనుమానం సహజంగానే బీజేపీకి వస్తుంది.

బీజేపీతో పొత్తు అంటే కొన్ని వర్గాలు దూరమయ్యే ప్రమాదం..!

అలాగే.. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పార్టీలు కూడా వ్యతిరేకంగా మారుతాయన్న ప్రచారం జరుగుతోంది. శివసేన చాలా రోజుల నుంచి బీజేపీని వ్యతిరేకిస్తోంది. నితీష్ కుమార్.. బీజేపీకి కటీఫ్ చెప్పి మహాకూటమిలో చేరుతాడా.. అన్న అనుమానాలు బీజేపీలో ఉన్నాయి. అందుకే..రాబోయే రాజకీయ పరిణామాలు తమకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి.. ఈ లోపే బహిరంగ మిత్రులను కలుపుకుందామని బీజేపీ ఆలోచిస్తోంది. కానీ టీఆర్ఎస్ మాత్రం… బీజేపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే నష్టమని భావిస్తోంది. బీజేపీని ముస్లింలు, దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో 12 శాతం ఉన్న ముస్లింలు… టీఆర్ఎస్ కు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. అలాగే సీమాంధ్ర ఓటర్లు కూడా… బీజేపీ కారణంగా.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది.

నేరుగా పొత్తులు వద్దని తేల్చేస్తున్న కేసీఆర్..!

అన్ని లెక్కలను చూసుకుని బీజేపీతో బహిరంగ పొత్తు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ ప్రకారం చూసినా బీజేపీతో బహిరంగ పొత్తు సాధ్యం కాదు. ఓ వైపు ఎంఐఎం..మరో వైపు టీఆర్ఎస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటుంది..?. అలాగే బీజేపీ కూడా డైలమాలో ఉంది. నేరుగా పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు గెలుద్దామా.. లేక… ఇప్పుడున్నట్లుగానే విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చూల్చి.. టీఆర్ఎస్ కు మంచి చేసి 2019 ఎన్నికల తర్వాత కలుద్దామా.. అన్న డైలమాలో బీజేపీ ఉంది. అందువల్ల ఓ రకంగా చెప్పాలంటే… బహిరంగ పొత్తుకు బీజేపీ దాదాపుగా సిద్ధంగానే ఉంది. కానీ… టీఆర్ఎస్ మాత్రం రెడీగా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.