టిఆర్‌ఎస్‌ వ్యూహాలు – కెటిఆర్‌ స్నేహగీతాలు

Telakapalli-Ravi

గ్రేటర్‌ హైదరాబాదు మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల చుట్టూనే ఇప్పుడు రాజకీయ దృష్టి మొత్తం కేంద్రీకృతమై వుంది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండటం ఒకటైతే ఇక్కడ జనాభా మిశ్రమంగా వుండటం మరో కారణం. 2009లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికలలో పాల్గొనకుండా ఉండిపోయింది. అప్పుడు టిడిపి ప్రథమ శక్తిగా వచ్చినా కాంగ్రెస్‌ మజ్లిస్‌ కలసి కార్పొరేషన్‌ను పాలించాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ (చట్టం) తర్వాత కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రథమ స్థానంలోనూ బిజెపి రెండవ స్థానంలోనూ వచ్చాయి. నగరంలోని 24 శాసనసభ స్థానాల్లోనూ టిడిపి-9, బిజెపి-5,మజ్లిస్‌-7 తెచ్చుకుంటే, టిఆర్‌ఎస్‌ కేవలం రెండింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఓట్లకు వచ్చేసరికి 22 శాతం తెచ్చుకుంది. తెలంగాణేతరులు, తెలుగేతరులు కూడా గణనీయంగా వుండటం ఇందుకు కారణంగా విశ్లేషణలు జరిగాయి.

కె.చంద్రశేఖరరావు తెలంగాణ సారథ్యం చేపట్టిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదేళ్లు ఇక్కడే వుంటానని ప్రకటించిన పరిస్థితి. అయితే తర్వాతి కాలంలో వాతావరణం క్రమంగా మారింది. చంద్రబాబు నాయుడుకు కుడిభుజాలుగా సన్నిహితులుగా పేరు పొందిన చాలా మంది పార్టీ మార్చి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు హైదరాబాదులో మాగంటి గోపీనాథ్‌, వివేకానంద గౌడ్‌, అరికెపూడి గాంధీ మాత్రమే తెలుగుదేశంతో వున్నారు. అందులోనూ గాంధీపై చాలా కథనాలు వుండగా వివేకానంద కొంతకాలం మెతగ్గా ఉండి ఇప్పుడు మళ్లీ గట్టిగానే పార్టీని భుజాన వేసుకుంటున్నారు. ఆర్‌.కృష్ణయ్య కూడా ఉన్నా ఆయనను ప్రధానంగా బిసి నేత.ఫిరాయింపులకు తోడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి అరెస్టు కూడా టిడిపిని కుదిపేసింది. ఆ సందర్భంగా తమపై నిఘా వేశారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించడమే గాక విజయవాడకు త్వరితంగా తరలిపోయారు.

అదే సమయంలో కార్పొరేషన్‌ ఎన్నికలలో బిజెపితో రాజకీయ సంఘటనను మాత్రం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంభాషణలు కలయికలు పెరిగినా, రాజకీయంగా టిడిపి, టిఆర్‌ఎస్‌ వైరం తగ్గలేదు. చంద్రబాబు కెసిఆర్‌ ప్రభుత్వంపై ప్రత్యక్ష విమర్శలు తగ్గించడంతో బిజెపి కూడా ఇరుకున పడిపోయింది. అంతకు ముందే ఆ పార్టీ అద్యక్షుడు కిషన్‌రెడ్డి మెతక వైఖరి అనుసరిస్తున్నారనే అంతర్గత విమర్శలువుండగా తెలుగుదేశం కూడా నీరసపడిపోవడంతో ఇరు పార్టీల కూటమి ఊపు తగ్గింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపట్ల కూడా టిఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి అనుసరించడం మరింత ఇరకాటమైంది. కెసిఆర్‌ మరికొందరు సీనియర్లు కాస్త ప్రశంసలు కురిపిస్తుంటే కెటిఆర్‌ తీవ్ర విమర్శలు చేసే పని పెట్టుకున్నారు. రాజాసింగ్‌ అనే బిజెపి ఎంఎల్‌ఎను ఎగదోసి ఆయన ద్వారా శివసేనను ఏర్పాటు చేయించారని చూస్తున్నారనే కథనాలున్నాయి. అసలు కెసిఆర్‌ చేసిన చండీయాగంతో బిజెపిని మించిన హిందూత్వ వాది అయ్యారనేది టిఆర్‌ఎస్‌ ఉత్సాహం! ఇది గాక మజ్లిస్‌తో నేస్తం వుంది గనక అవసరమైతే వారితో జట్టుకట్టయినా జిహెచ్‌ఎంసి కైవశం చేసుకోగలమనే ధీమా వారిది!

నిజానికి టిఆర్‌ఎస్‌ మొదటి ఏడాది కాలంలోనూ హైదరాబాదు సమస్యలపై పెద్దగా కేంద్రీకరించలేదు. కార్పొరేషన్‌ ఎన్నికలను త్వరితంగా పూర్తి చేయడంపైనా శ్రద్ద చూపలేదు. తన బలం పెరిగిందని నమ్మకం కుదిరాకే కసరత్తు ప్రారంభించింది. కెసిఆర్‌ అనుకూలుడుగా ముద్ర వేయించుకున్న సోమేష్‌ కుమార్‌ను బదిలీ చేయడంతో ఈ కసరత్తు మొదలైంది. బహుశా గోదావరి జలాల తరలింపులో చివరి దశను పూర్తిచేసి నీరందించడంతో ఊపందుకుంది. ఈ పథకం గత ప్రభుత్వ హయాంలో నుంచి జరుగుతున్నదే అయినా ఆఖరి ఘట్టంలో అధికారంలో ఉండటం వారికి కలసి వచ్చింది. ఇక కెటిఆర్‌ మొత్తం మకాం వేసి ఇక్కడ విజయమే ఏకైక లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. మంత్రులందరికీ డివిజన్ల వారీ బాధ్యతలు కేటాయించడమే గాక ఎంఎల్‌ఎలు ఎంఎల్‌సిలకూ నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యయప్రయాసలు మోయలేని స్థాయిలో వున్నాయని కెసిఆర్‌కు దగ్గరగా మసలే ఒక నాయకుడే అన్నారు. ఏది ఏమైనా హైదరాబాదు గెలవకపోతే తెలంగాణలో అధికారానికి అర్థం వుండదనీ నైతిక బలం పోతుందని కెసిఆర్‌ భావిస్తున్నారన్నది స్పష్టం. అందుకు సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించడానికి ఆయన సకల సన్నాహాలు చేసుకున్నాకే సమరశంఖం మోగించారు. మజ్లిస్‌కు పాతబస్తీ వరకూ పరోక్షంగా సహకరించడం కూడా ఈ వ్యూహంలో ఒక భాగం. ప్రజా ప్రతినిధులకు కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో ఓటు హక్కు నివ్వడం ఆఖరి అస్త్రం.

కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ఇచ్చింది తామేనని ఎంత చెప్పుకున్నా అది హైదరాబాదులో పెద్దగా పనిచేయదు.మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వారికి ఒక్కటంటే ఒక్కస్థానం రాకపోవడమే అందుకు నిదుర్శనం. గతంలో దానం నాగేందర్‌ ఇక్కడ మేయర్‌ స్థానానికి పోటీ పడినా ఫలితం లేకపోయింది. ఈసారి ఆయన అదే స్థానం కోసం టిఆర్‌ఎస్‌తో బేరం పెట్టి చివరివరకూ కుదరకపోవడంతో కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. అయితే ఆయన వ్యతిరేకులు దాడి చేసి గాయపర్చడంతో వివాదానికి దారితీసింది. ఈ సమయంలో కాంగ్రెస్‌ నాయకులు తమకు చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నా ఐక్యతా లోపం వెంటాడుతున్నది. దానికి తోడు దేశమంతటా బలహీనపడుతున్న ప్రభావం కూడా వుంది. ఎన్నికల నిర్ణయంపై కోర్టులో పోరాడి టిఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టడంలో మాత్రం కాంగ్రెస్‌ కృతకృత్యమైందిగాని ఎన్నికల రంగంలో అంతటి ఆశలేదు.

ఉభయ కమ్యూనిస్టుపార్టీలు లోక్‌సత్తా కలసి “వన్‌ హైదరాబాదు” పేరుతో పోటీ చేస్తున్నాయి. అయితే ఆ ప్రభావం కొన్ని స్థానాలకే పరిమితమై వుంటుంది.
ఈ ఎన్నికల పర్వంలో మీడియాను ప్రజలను కూడా ఆకర్షిస్తున్నది కెటిఆర్‌ ప్రచార నినాదం. సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకోవడం కోసమే ఆయనను ప్రయోగించారని అందరూ భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన మరీ ముందుకువెళ్లి తమ పార్టీ పేరు ‘తెలుగు రాష్ట్ర సమితి’ అని మార్చుకోవడానికి సిద్ధమన్నారు. భీమవరం నుంచి పోటీ చేస్తానని కూడా సరదాగా ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి సవాలుకు సమాధానంగా ఆ ప్రకటన చేసినా అందులో టిఆర్‌ఎస్‌ ప్రయోజనాలు కూడా వున్నాయి. ఒకసారి అధికారంలోకి వచ్చాక అన్ని తరగతులనూ ఆకర్షిస్తేనే మనుగడ అన్నది వారి ఆలోచనగా ఉంది. అంతేగాని వ్యతిరేకులు ఆరోపిస్తున్నట్టు ఎన్నికల తర్వాత మళ్లీ పాత పంథాకు తిరిగిపోవడం కాకపోవచ్చు. సీమాంధ్ర వ్యాపారవేత్తలతో టిఆర్‌ఎస్‌ నేతలకు సత్సంబంధాలే వున్నాయి. సినిమావారికి చాలా ప్రాధాన్యతనిస్తుంటారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఆ తరహా మాటలకు అర్థం వుండదని కూడా అందరికీ తెలుసు. నిజంగా టిఆర్‌ఎస్‌ మారకపోతే దానికి మూల్యం చెల్లిస్తుంది. అంతేగాని ముందునుంచి సీమాంధ్ర ఓటర్ల చుట్టూ చర్చ తిప్పి వారిలో ఆందోళన కలిగిస్తే ఆ భయంతో వారికే ఓటు వేసే అవకాశముంటుందని కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. అయితే మరో నినాదం లేని స్థితిలో కమ్యూనిస్టేతర ప్రతిపక్షాలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. దీనివల్ల వారికి నిజంగా లాభం జరుగుతుందని చెప్పడం కష్టం. మజ్లిస్‌ బిజెపిల రాజకీయాలు కూడా ఎలాటి పరిస్థితికి దారి తీస్తాయో చూడాలి. జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో మరింత స్తిరత్వం వస్తుందనేది వాస్తవం. అన్యూహ పరిణామాలేవీ జరక్కపోతే అది కెసిఆర్‌కు అనుకూలమైన దిశలో వుండే అవకాశం ఎక్కువ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com