టీఆర్ఎస్లో ఇప్పుడు అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కనిపిస్తున్నారు. కేసీఆర్ మూలవిరాట్‌గా పార్టీ వ్యవహారాల్లో ఉండిపోయారు. మొత్తం రాష్ట్ర స్థాయిలో కేటీఆరే ఒంటి చేత్తో నడుపుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. పార్టీ ప్లీనరీని ఒక్క రోజు హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం నిర్వహణ దగ్గర్నుంచి మీడియాకు ఇంటర్యూలు ఇవ్వడం వరకూ అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మీడియాకు ఆయన ఇంటర్యూకు సమయం కేటాయించారు.
అదే సమయంలో కేసీఆర్ గైర్హాజరీ అనే అభిప్రాయం ఎవరికీ కనిపించనీయలేదు. మొత్తం విధానపరమైన నిర్ణయాలను ఆయన సాధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలపై తన విజన్‌ను.. తమకు గెలుపు వ్యూహాలపై ఉన్న స్పష్టతను అన్నీ వివరించారు. కేటీఆర్ పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న విషయం… అందులోనూ ఆయన సమర్థత చూపుతున్న వైనం మరోసారి స్పష్టమయింది. ఇప్పటికే కేసీఆర్ ఎక్కువగా జాతీయ రాజకీయాల చర్చలు… ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. అత్యంత ముఖ్యమైన అంశాలపై మాత్రమే సమీక్ష చేస్తున్నారు.
కేసీఆర్ బాధ్యతలను కేటీఆర్ పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు . ఎక్కడా కేసీఆర్ ఈ సమస్యను టేకప్ చేసి ఉంటే పరిష్కారమయ్యేది అనే భావన రాకుండా చేయగలుగుతున్నారు. అటు పాలనా వ్యవహారాలు.. ఇటు పార్టీ వ్యవహారాలను హ్యాండిల్ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి వరకూ ఇక కేటీఆర్ నే సుప్రీం అని.. ఆయన తన చేతులతోనే నిరూపించేసుకున్నారు. క్యాడర్ కూడా.. దానికి ఫిక్సయిపోయారు. బుధవారం ప్లీనరీ తర్వాత కేటీఆర్ మరింత స్ట్రాంగ్ లీడర్‌గా మారే అవకాశం ఉంది.