ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవాస్తవాలతో దాడి చేస్తున్నారు. ఫోన్ చేయకపోయినా చేశారని చెప్పడం.. భారత్, పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్పడం దగ్గర నుంచి తన ఆనందం కోసం మోదీ రష్యా ఆయిల్ కొనుగోళ్లు తగ్గించారని చెప్పడం వరకూ చాలా అవాస్తవాలు చెప్పారు. తాజాగా యుద్ధరంగంలో వాడే అపాచీ హెలికాఫ్టర్లను ఇండియాకు అమ్మకంపైనా అవే అబద్దాలు చెప్పారు. అంతేనా తనను తాను సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ప్రకటించుకున్నారు.
భారత్ 68 అపాచీ హెలికాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. డెలివరీలో జాప్యం జరగడంతో ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి సార్, మిమ్మల్ని ఒకసారి కలవవచ్చా అని అడిగారు అని ట్రంప్ తన శైలిలో చెప్పుకొచ్చారు. అయితే రికార్డుల ప్రకారం, భారత్ మొత్తం మీద కేవలం 28 అపాచీ హెలికాప్టర్లను మాత్రమే ఆర్డర్ చేసింది. ఇందులో మొదటి విడతగా వాయుసేన కోసం 22 హెలికాప్టర్లను, రెండో విడతగా సైన్యం కోసం 6 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ట్రంప్ 40హెలికాఫ్టర్లు ఎక్కువగా చెప్పారు.
హెలికాప్టర్ల డెలివరీలో జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, దానికి ట్రంప్ చెబుతున్న కారణాలకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. భారత సైన్యం కోసం ఆర్డర్ చేసిన 6 హెలికాప్టర్లు 2024 ఆరంభంలో రావాల్సి ఉండగా, అవి జూలై 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య భారత్కు చేరాయి. కోవిడ్ వల్ల వచ్చిన సమస్యలతో బోయింగ్ సంస్థ వీటిని ఆలస్యంగా పంపింది. చివరి బ్యాచ్ విమానాలు టర్కీ గగనతల అనుమతి నిరాకరించడం వల్ల జాప్యం జరిగింది.
ప్రధాని మోదీ తనను సార్ అని పిలుస్తూ అపాయింట్మెంట్ కోరారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన అతిశయోక్తికి అద్దం పడుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలందరూ తనను సార్ అని పిలుస్తారని చెప్పుకోవడం ట్రంప్ పాత అలవాటే. కానీ మోదీ విషయం మాత్రం అలా అనడం ఆయన విపరీత ప్రవర్తనకు నిదర్శనం. నిజానికి భారత్ భారత్ తన రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గిస్తోంది. అపాచీలకు ప్రత్యామ్నాయంగా భారత్ సొంతంగా తయారు చేసిన హాల్ ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ల వైపు మొగ్గు చూపుతోంది.
