వెనిజులా అధ్యక్షుడ్ని కిడ్నాప్ చేసి తీసుకు వచ్చినా ఎవరూ మాట్లాడలేదని ఇప్పుడు ఇరాన్ పైనా గురి పెట్టారు ట్రంప్. ప్రపంచంతో తనకు సంబంధం లేదని అన్ని రకాల బంధాలు తెంచుకుంటున్న ఆయన ఇతర దేశాల వివాదాల్లో తలదూర్చడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇది అమెరికాతో పాటు ప్రపంచానికి పెను ప్రమాదం సృష్టించోతోంది. ఇరాన్ పై ఎప్పుడైనా దాడులు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రభావం ప్రపంచం మొత్తంపై పడుతుంది.
ఇరాన్ అంత బలహీన దేశం కాదు !
అమెరికా ఇరాన్‌పై సైనిక దాడులకు దిగితే, అది కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ఆర్థిక , రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది. వెనిజులాలో మదురో ప్రభుత్వం పతనం అయినట్లుగా ఇరాన్ పాలక వర్గం నిశ్శబ్దంగా ఉంటుందని భావించడం కష్టం. ఎందుకంటే ఇరాన్ వద్ద అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు , శక్తివంతమైన డ్రోన్ బలగాలు ఉన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ హోర్ముజ్ జలసంధి ని మూసివేస్తే, ప్రపంచ చమురు సరఫరాలో నాలుగో వంతు నిలిచిపోయి పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్‌కు పెను ముప్పు
యొమెన్ హూతీలు, లెబనాన్ హెజ్బుల్లా, ఇరాక్ లోని పారామిలిటరీ బృందాలు అమెరికా స్థావరాలు , ఇజ్రాయేల్‌పై దాడులు చేసే అవకాశం ఉంది. రష్యా, చైనాలు నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా, అమెరికాను నిరోధించడానికి ఇరాన్‌కు దౌత్యపరమైన ,సాంకేతిక సహకారాన్ని అందించవచ్చు. అమెరికా తన మిత్రదేశాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా దాడులకు దిగితే, అది అంతర్జాతీయంగా అగ్రరాజ్యం పట్ల అసహనాన్ని పెంచుతుంది. ఎవరూ సహకరించడానికి, మద్దతివ్వడానికి ముందుకు రారు.
గ్రీన్ ల్యాండ్ పై కన్నేయడంతో నాటో కూడా దూరమే!
మరోవైపు, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆకాంక్షలు నాటోను చీల్చేస్తున్నాయి.. నాటో మిత్రదేశమైన డెన్మార్క్ భూభాగంపై కన్నేయడం, మరోపక్క మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్మడం చూస్తుంటే.. ఇరాన్‌పై దాడులు జరిగితే అది కేవలం ఒక దేశంపై దాడి కాదు, ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చివేసే పరిణామం అవుతుంది. ఇరాన్ లోపల జరుగుతున్న ప్రజా నిరసనలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినప్పటికీ, విదేశీ దాడి జరిగినప్పుడు ప్రజలు జాతీయవాదం పేరుతో ప్రభుత్వం వెంటే నిలబడే అవకాశం కూడా ఉంది. ట్రంప్‌నకు ఈ విషయం అర్థమయ్యే సరికి చేతులు కాలిపోతాయి.
