డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సైనిక చర్య చేపట్టి నికోలస్ మదురోను గద్దె దించిన తర్వాత, ఇప్పుడు ఆయన దృష్టి ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌పై పడింది. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకోవడం ద్వారా జాతీయ భద్రతను పటిష్టం చేయవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే మూడు దశల రహస్య వ్యూహాన్ని అమలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే గ్రీన్ ల్యాండ్ పై పంజా
గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి దౌత్యపరమైన, ఆర్థికపరమైన పంజా విసిరింది. డెన్మార్క్ ప్రభుత్వంపై ప్రత్యక్ష ఒత్తిడి తీసుకురావడం, గ్రీన్‌ల్యాండ్ రక్షణ బాధ్యతలను డెన్మార్క్ సరిగా నిర్వహించలేకపోతోందని టార్గెట్ చేసి.. ఆ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించాలని త్వరలోనే డిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వంటి కీలక నేతలు ఈ దిశగా వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మద్దతు ఇచ్చే స్థానిక పౌరులు , రాజకీయ నేతల జాబితాను తయారు చేసి, వారి ద్వారా స్వయంప్రతిపత్తి లేదా విడిపోయే ఉద్యమాలను ప్రోత్సహించే వ్యూహాలను ఇప్పటికే ప్రారంభించారు.
గ్రీన్‌ల్యాండ్‌పై అదే పని చేస్తే నాటోలో చీలిక
గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి వేరు చేసి, చివరకు అమెరికాలో ఒక భాగంగా మార్చుకోవాలనేది ట్రంప్ అసలు ప్లాన్ . డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించారు. గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదని, అది ఎవరికీ సొంతం కాదని ఆమె స్పష్టం చేశారు. కానీ, వెనిజులాలో ట్రంప్ చేపట్టిన ఆకస్మిక సైనిక చర్యను చూసిన తర్వాత, గ్రీన్‌ల్యాండ్ విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గకపోవచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఒకవేళ ట్రంప్ తన మొండి వైఖరిని కొనసాగిస్తే, ఇది నాటో కూటమిలో చీలికకు , ఐరోపా దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతినడానికి దారితీసే అవకాశం ఉంది.
గ్రీన్ ల్యాండ్ ..అమెరికాకు ఎందుకు కీలకం?
అమెరికాకు గ్రీన్‌ల్యాండ్ అత్యంత కీలకం కావడానికి ప్రధాన కారణం భౌగోళిక వ్యూహం, ఉత్తర అమెరికాకు రక్షణ కవచంలా ఉండే ఈ ద్వీపం ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవచ్చు. అలాగే ఖనిజ సంపద, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, నికెల్ వంటి అరుదైన ఖనిజాలు అపారంగా ఉన్నాయి, ఇవి ప్రస్తుతం చైనా గుత్తాధిపత్యంలో ఉన్నాయి. మూడవది సైనిక ప్రాధాన్యత, గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే అమెరికాకు చెందిన ఎయిర్ బే ఉంది, ఇది క్షిపణి హెచ్చరికలు , అంతరిక్ష నిఘాకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కేంద్రం. ఆర్కిటిక్ మంచు కరుగుతుండటంతో, గ్రీన్‌ల్యాండ్ మీదుగా కొత్త అంతర్జాతీయ రవాణా మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది, వీటిపై నియంత్రణ సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం.
