అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ కోసం యూరప్ దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. గ్రీన్లాండ్ విక్రయంపై చర్చలకు నిరాకరిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాల నుండి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుండి 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభావం నేరుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికాలోని వాల్ స్ట్రీట్ భారీగా నష్టపోయింది. S&P 500 సూచీ అక్టోబర్ తర్వాత అతిపెద్ద పతనాన్ని నమోదు చేయగా, డౌ జోన్స్ ఏకంగా 870 పాయింట్లు పడిపోయింది.
ఎన్విడియా, ఆపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐరోపా దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా బేర్ మన్నాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. వాల్ స్ట్రీట్లో అలజడి మొదలైనప్పుడు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని, సురక్షితమైన ఆస్తులైన బంగారం లేదా అమెరికా డాలర్ వైపు మళ్లుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. దీనివల్ల నిఫ్టీ, సెన్సెక్స్ వంటి భారత సూచీలు భారీగా నష్టపోతున్నాయి.
ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల భారత ఐటీ , ఫార్మా రంగాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అక్కడ దిగుమతి సుంకాలు పెరిగినా లేదా వీసా నిబంధనలు కఠినతరం చేసినా భారత కంపెనీల ఆదాయం తగ్గిపోతుంది. దీనికి తోడు, అమెరికా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ క్షీణించడం భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతోంది. ప్రస్తుతం మార్కెట్లను శాసిస్తున్న ప్రధాన అంశం మాత్రం ట్రంప్ ఫ్యాక్టర్ అనడంలో సందేహం లేదు.
