ప్రపంచశాంతి కోసం ట్రంప్ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చి పది నెలలు కాక ముందే నెలకో యుద్ధాన్ని ఆపేశారు. ఇప్పుడు గాజాలో శాంతిని నెలకొల్పేశారు. ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే ఆ పని పూర్తి కాక ముందే మరో యుద్ధాన్ని ఆపే బాధ్యత ఆయన ఎదుటకు వచ్చింది.
ప్రస్తుతం పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ బాంబులేసుకుంటున్నాయి. ఆప్ఘనిస్థాన్ కు చెందిన టీటీపీ అనే తాలిబన్ ఉగ్రవాద సంస్థ తమ దేశంలోకి చొరబడుతోందని పాకిస్తాన్ దాడులు చేస్తోంది. కాబూల్ పైనా దాడులు చేసింది. ప్రతిగా ఆప్ఘనిస్థాన్ కూడా దాడులు చేసింది. వంద మందికిపైగా పాక్ సైనికుల్ని మట్టుబెట్టామని ప్రకటించింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అంటే ఉగ్రవాదుల పోరాటం లాంటిదే. దీన్ని ఆపడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు.
పశ్చిమాసియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై దృష్టి పెడతానని ట్రంప్ చెబుతున్నారు. పాకిస్తాన్ .. ఇప్పుడు ట్రంప్ కరుణా కటాక్షల కోసం చూస్తోంది. ట్రంప్ ఏం చెబితే అది చేస్తారు.కానీ ఆప్ఘన్ అలా కాదు.తాలిబన్లు ట్రంప్ మాటలు వినేందుకు సిద్ధంగా లేరు. ఇటీవల ఓ ఎయిర్ బేస్ విషయంలో ట్రంప్ మాటల్ని వినేది లేదని తాలిబన్లు ప్రకటించారు. వారిపై తాము సుంకాలు విధిస్తామని బెదిరించడానికి కూడా ట్రంప్‌నకు అవకాశం లేదు. మరి ఈ యుద్ధాన్ని ఎలా ఆపుతారో ?