అమెరికా అధ్యక్షుడిగా తనను గెలిపించేందుకు చాలా సమయం, డబ్బు వెచ్చించిన ఎలాన్ మస్క్ ధిక్కారాన్ని ట్రంప్ భరించలేకపోతున్నారు. తాను ప్రవేశ పెడుతున్న బిగ్ బ్యూటీఫుల్ బిల్లుకు వ్యతిరేకంగా పదే పదే మాట్లాడుతున్న మస్క్ కు ఆయన గట్టి షాక్ ఇవ్వాలనుకుంటున్నారు. కొత్త పార్టీ పెడతానంటున్న మస్క్ ను సౌతాఫ్రికాకు డిపోర్ట్ చేసే ఆలోచన చేస్తున్నానని ప్రకటించేశారు.
ఎన్నికల్లో తన విజయానికి మస్క్ సాయం చేశారని అయితే ఎన్నికల ప్రచారంలో తాను ఈవీలకు సబ్సిడీలు ఇవ్వడాన్ని వ్యతిరేకించానని గుర్తు చేశారు.తాను గెలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఎత్తేస్తానని ఎప్పుడో చెప్పానన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్నానని.. స్పష్టం చేశారు. ఈవీలకు సబ్సిడీలు ఎత్తేస్తే ఎలాన్ మస్క్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన దివాలా తీస్తారని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికాలో అత్యధికంగా ప్రభుత్వ రాయితీలు పొందిన వ్యక్తి మస్క్ అని ట్రంప్ అంటున్నారు. అమెరికాలో రచ్చ చేస్తే సౌతాఫ్రికాకు డిపోర్టు చేస్తానని హెచ్చరించారు.
మస్క్ వ్యవహారశైలిని గమనిస్తే ఆయన మాటల్ని అంత తేలికగా తీసుకోవడానికి అవకాశం ఉండదు. తిక్క రేగితే దేశం నుంచి బహిష్కరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకురాగలరు. సౌతాఫ్రికా దంపతులకు కెనడాలో జన్మించారు ట్రంప్. మొదట సౌతాఫ్రికా పౌరసత్వం.. తర్వాత కెనడా పౌరసత్వం లభించింది. చదువుకునేందుకు అమెరికాకు వచ్చి అక్కడే వ్యాపారాలతో ప్రపంచ కుబేరునిగా ఎదిగారు. రాజకీయాల్లో జోక్యం చేసుకుని వివాదాస్పదం అవుతున్నారు. చివరికి డిపోర్ట్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అదీ కూడా తాను గెలుపు కోసం ప్రయత్నిచిన ట్రంప్ నుంచే.