భారతీయ విద్యార్థులు అమెరికాకు వచ్చేందుకు అవకాశాల్ని తగ్గించేందుకు ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. అమెరికా యూనివర్శిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల సీట్లకు కఠిన పరిమితులు విధిస్తూ మెమో జారీ చేశారు. ఒక యూనివర్సిటీలో అంతర్జాతీయ అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు 15 శాతం మాత్రమే ఉండాలని, వాటిలో ఒకే దేశానికి చెందిన వారు 5 శాతం మాత్రమే అనుమతించాలని కొత్తగా మెమో జారీ చేశారు. ఇది భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. యూఎస్‌లో ప్రస్తుతం 10 లక్షల మంది పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనే ఉన్నారు.
ఇతర షరతులు కూడా పెట్టారు. ఐదేళ్లకు ట్యూషన్ ఫీజులు ఫ్రీజ్ చేయాలి. రేస్, జెండర్ ఆధారంగా అడ్మిషన్లు, నియామకాలు చేయకూడదు. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారా లేదా అన్నది పరీక్షించాలి. అలాగే డిసిప్లినరీ రికార్డులు ఫెడరల్ ఏజెన్సీలతో షేర్ చేయాలి. యూనివర్శిటీలు ఈ షరతులకు అంగీకరిస్తే ఫెడరల్ ఫండింగ్‌కు ప్రాధాన్యత లభిస్తుంది. తిరస్కరిస్తే ఫండింగ్ కట్ అవుతుంది.
యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థులలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో 3,13,000 మంది అంతర్జాతీయులు అమెరికా వెళ్లారు. రకరకాల ఆంక్షలతో 2025 ఆగస్టులో 19 శాతం విద్యార్థులు తగ్గిపోయారు. ప్రస్తుత నిబంధనలతో యూనివర్సిటీలో 1,000 అండర్గ్రాడ్యుయేట్ సీట్లుంటే, అంతర్జాతీయులకు 150 మాత్రమే, భారతీయులకు 50 మాత్రమే కేటాయిస్తారు. భారతీయ విద్యార్థుల మీదనే ఆధారపడిన యూనివర్శిటీలు చాలా ఉన్నాయి. వాటిలో సగానికిపైగా భారతీయులు ఉంటారు. ఈ నిబంధనలతో అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గుతుంది.
ప్రస్తుతం మెమోను అంగీకరించాలని యూనివర్శిటీలకు గడువు నియమించారు. ప్రభుత్వ ఫండింగ్ వద్దనుకునే యూనివర్శిటీలు ఈ మెమోను తిరస్కరించే అవకాశం ఉంది. కానీ ట్రంప్ భయంతో యూనివర్శిటీలు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.